జ్ఞాపకాల జడిలో అభినందనల వేడుక.. ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

by Kodari Anjali |

సూర్యాపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల 2008-2011 బ్యాచ్ విద్యార్థినులు ఆదివారం ఒకచోట కలిశారు.

జ్ఞాపకాల జడిలో అభినందనల వేడుక.. ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
X

దిశ, సూర్యాపేట: ఒకప్పుడు ఒకే పాఠశాలలో, ఒకే హాస్టల్‌లో కలిసి చదువుకున్న స్నేహితులు, దశాబ్దాల తర్వాత మళ్ళీ కలుసుకుంటే ఆ ఆనందమే వేరు. సూర్యాపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల 2008-2011 బ్యాచ్ విద్యార్థినులు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించుకున్న ఆత్మీయ సమ్మేళనం భావోద్వేగాల మేళవింపుగా సాగింది. తమ జీవితాన్ని తీర్చిదిద్ది, క్రమశిక్షణను నేర్పిన గురువుల పట్ల కృతజ్ఞతను చాటుకుంటూ, హాస్టల్ రోజుల్లో తమకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ఈ సందర్భంగా పూర్వ విద్యార్థినులు ఘనంగా సన్మానించారు. శాలువాలు, పూలమాలలతో వారిని గౌరవించుకున్నారు.

భవిష్యత్తులో కూడా ఇలాగే...

ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ, హాస్టల్‌లో చదువుకుని, నేడు సమాజంలో వివిధ హోదాల్లో స్థిరపడిన తమ విద్యార్థినులను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. 2008 నుంచి 2011 వరకు హాస్టల్‌లో తాము గడిపిన రోజులను, చిన్ననాటి అల్లరిని, చదువుకున్న జ్ఞాపకాలను స్నేహితురాళ్ళందరూ నెమరువేసుకున్నారు. కష్టసుఖాలను పంచుకుంటూ, రోజంతా సరదాగా గడిపారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రతి ఏటా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుని, అందరం కలిసి మెలిసి ఉండాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థినులు నవిలా లలిత, కాంపాటి రజిత, సల్వాది లావణ్య, కాంపాటి సరిత, కళ్యాణి, రజిత, మధుర, స్వరూప, రమణ, స్వరాజ్యం, సరితలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story