నిరీక్షణకు తెర..

by Sumithra |
నిరీక్షణకు తెర..
X

దిశ, తుంగతుర్తి : వివిధ పదవులలో తనకు ప్రాముఖ్యతనివ్వాలంటూ గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంతో పార్టీ క్యాడర్ లో సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలానికి చెందిన దయాకర్ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014, 2018 లలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని భావించి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి అది నోటి వద్దకు వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీంతో ఆయన కొంత నిరాశలో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కల్పించుకొని శాంతింప చేశారు. తనతో పాటు వరంగల్, సూర్యాపేట, తదితర జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల విజయం కోసం జరిగిన ప్రచారంలో తిప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయనకు పదవుల పరంగా సరైన గుర్తింపు లభించలేదు. అనంతరం ఆయన వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.

53 ఏళ్ల వయసు కలిగిన అద్దంకి దయాకర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో చిరపరిచితులయ్యారు. ఎంకామ్, ఎంసీఏ, ఎల్.ఎల్.బి, కామర్స్ లో పీహెచ్డీలు ఆయనకున్న అర్హతలు. మొదట్లో 2006 నుండి 2018 వరకు మాల మహానాడు ఫౌండర్ తో పాటు అధ్యక్షులు కూడా 2006 నుండి కార్యదర్శిగా, సాధన సమైక్య వేదిక (కొండా లక్ష్మణ్ బాపూజీ లీడర్షిప్ లో కన్వీనర్ గా కన్వీనర్ గా, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా, ఇలా ఎన్నెన్నో హోదాల్లో కొనసాగారు. 2014లో టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా, 2009 నుండి 14 వరకు టీ - జాక్ లో కొనసాగారు. జార్ఖండ్ రాష్ట్రానికి ఎన్నికల డీఆర్ఓ తో పాటు పలు రాష్ట్రాల్లో పలు అంశాల పై కీలకంగా వ్యవహరించారు. 3 వేల పైచిలుకు టీవీ డిబేట్స్ పాల్గొన్నారు.

2014 నుండి తుంగతుర్తి పై పట్టు...

ఎస్సీ రిజర్వుడుగా ఉన్న తుంగతుర్తి అసెంబ్లీ నుంచి 2014లో తొలిసారి పోటీ చేసి ఆనాడు టీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2018లో ఇదే పరిస్థితి కొనసాగింది. తన ఓటమి పై కోర్టును కూడా ఆశ్రయించారు. 2023 లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని ప్రయత్నించి చివరికి విఫలమయ్యారు. ఒక దశలో టీపీసీసీకి చీఫ్ కావాలని కూడా ప్రయత్నాలు చేశారు.



Next Story