నాడు ఉద్యమాలతో... నేడు దరఖాస్తులతో..

by Disha Web Desk 20 |
నాడు ఉద్యమాలతో... నేడు దరఖాస్తులతో..
X

దిశ, తుంగతుర్తి : వివిధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారానికి పలుతరహాలలో ఉద్యమాలు చేస్తే నేడు కేవలం ఇచ్చిన దరఖాస్తులతోనే సత్వరంగా పరిష్కారం అవుతున్నాయని బీఆర్ఎస్ కార్మిక విభాగం తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ గౌడిచర్ల సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం తుంగతుర్తిలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వాల అసమర్ధత వల్ల వివిధ రంగాలకు చెందిన కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాగా ఉండేవని దుయ్యబట్టారు.

తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగినప్పటికీ ఫలితం లేదని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే కార్మిక సమస్యలు అంచలంచలుగా పరిష్కారమవుతున్నాయని అన్నారు. కార్మిక సంక్షేమానికి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం వల్లే వారి కుటుంబాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భీమా పథకాల పట్ల కొంతమంది కార్మికులకు అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు.

దీనిపై విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ ప్రతి కార్మికుడు భీమ కలిగి ఉండాలని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ వందలాదిమందికి వివిధ రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నాడని వివరించారు. త్వరలో జరగబోయే మేడే ఉత్సవాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు బొంకూరి శ్రీను, ప్రధాన కార్యదర్శి కొడిదల వెంకన్న, ఆటో యూనియన్ అధ్యక్షులు మోహన్ లాల్, తూము వెంకన్న, హనుమంతు, పి.రాజేష్, యాదగిరి, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed