బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కారును వీడనున్న కీలక నేత!

by Vinod kumar |
బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కారును వీడనున్న కీలక నేత!
X

దిశ, నాగార్జునసాగర్: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్ఆర్ఐ కీలక నేత త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, నాగార్జునసాగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుడు గడ్డంపల్లి రవీందర్‌ రెడ్డి. పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి మంత్రి కేటీఆర్ దగ్గర స్నేహితుడు కావడం విశేషం. నాగార్జున సాగర్ నియోజకవర్గం కీలక నాయకులు అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కీలక నాయకులతో చేరికపై చర్చలు జరిపినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని యువ నాయకుడిని ఆహ్వానించినట్లు గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఆయన త్వరలో ముఖ్య అనుచరులతోపాటు కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. పట్టుమని పదిరోజులు కూడా లేని సమయంలో కీలక నేత కారు దిగతుండడంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కారు స్పీడ్‌కు బ్రేక్ పడ్డట్లే. యువతతో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

జీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు..

గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి పలు సేవా కార్యక్రమాలతో నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన సుపరిచితుడే. ఏ ఇంటికి ఆపద వచ్చిన ఆయన ముందుండి తాను ఉన్నాను అంటూ వారికి అండగా నిలిచేవారు. నియోజకవర్గంలో మంచి, చెడు ఏ కార్యక్రమం అయినా ఆయన వారి వెన్నంటే ఉంటారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గడ్డంపల్లి రవీందర్‌రెడ్డికి సాగర్ నియోజకవర్గంలోని మంచి పట్టున్న నాయకుడిగా పేరుంది.

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రవీందర్‌ రెడ్డికి సంతృప్తి లేదు. పుట్టిన గడ్డకు ఏదో చేయాలని తపించిన ఆయన జీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో నాగార్జునసాగర్ కమల నెహ్రూ ఆస్పత్రిలో భోజనం టిఫిన్ సౌకర్యం కల్పించారు. ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుకగా కింద రూ.5,000 అందజేసేవారు. అలాగే ఆధ్వర్యంలో పలుమార్లు క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించారు.

బీఆర్ఎస్‌ పార్టీకి ఇది కోలుకోని దెబ్బె..

గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. అమెరికాలో ఉద్యోగం వదులుకోని వచ్చిన ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక ధూందాం కార్యక్రమాలు చేపట్టారు. గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఆయన మొండిచెయ్యి చూపించింది. దీంతో ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీపై అలిగిన ఆయన కొంతకాలం పాటు అమెరికా వెళ్లిపోయారు. అనంతరం దేశానికి వచ్చిన ఆయనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చలు జరిపినట్లు సమాచారం. యువతలో కూడా ఆయన మంచి క్రేజ్ ఉన్న గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి పార్టీని వీడితే గులాబీ పార్టీకి తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న కీలక సమయంలో బీఆర్ఎస్‌ పార్టీకి ఇది కోలుకోని దెబ్బె.



Next Story