బీజేపీ, టీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు..

by Disha Web Desk 14 |
బీజేపీ, టీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ.. ఐదుగురికి గాయాలు..
X

దిశ, తుంగతుర్తి: ఆనందంగా సాగాల్సిన విజయదశమి పండుగ పగలు ప్రతీకారాలకు వేదికయ్యాయి. జమ్మి చెట్టు వద్ద జరగాల్సిన పూజ కార్యక్రమాలు చెల్లాచెదురయ్యాయి. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన అందరినీ నివ్వెరపరిచింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పట్టాభి రామచంద్ర స్వామి ఆలయం వద్ద ప్రతి ఏడాది జరిగే మాదిరిగానే ప్రస్తుతం కూడా జమ్మి పూజ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా అక్కడికి సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్రావుతోపాటు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మొదలైన స్వల్ప ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. ఈ మేరకు రాళ్లతో దాడులు జరిగాయి. కుర్చీలు గాల్లోకి లేచాయి. అక్కడ కొద్దిసేపు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. విసిరిన రాళ్లు, కర్రల దాడుల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబాకు తలపై బలంగా గాయాలయ్యాయి, మల్లెపాక లక్ష్మణ్, వీరబోయిన మహేష్, కొండ అజిత్, కటకం శరత్, నారగాని వెంకన్నలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుంగతుర్తి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేపడుతున్నారు.

Next Story