నియోజకవర్గానికి 3500 గృహాలు

by Naresh N |
నియోజకవర్గానికి 3500 గృహాలు
X

దిశ, తుంగతుర్తి: ఒక నియోజకవర్గానికి 3500 గృహాలను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. ఈ మేరకు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇప్పటికీ కూడా ప్రతి గ్రామంలో కనిపించేవి ఇందిరమ్మ గృహాలేనని, ఈ బొందల గడ్డ (బీఆర్ఎస్) పార్టీ కట్టించిన గృహాలు ఎక్కడ కనిపించడం లేదని ఆయన విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలోని రుద్రమ్మ చెరువును రిజర్వాయర్‌గా మార్చే అంశాన్ని సీఎం దృష్టికి తాను తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించాలని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణం గురించి వివరించాలని తెలిపారు. ఇప్పటికే కోరిన వెంటనే మోత్కూరు మండల కేంద్రానికి డిగ్రీ, తిరుమలగిరికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరు చేశారని వివరించారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారెంటీలను కేవలం మూడు మాసాలలోనే అమలు చేయడం జరిగిందని ఆయన వివరించారు. అలాగే ఈనెల 11న ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకోవడానికి రూ. 5 లక్షల ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యంగా చెప్పింది చేయడం - చేసేదే చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని స్పష్టం చేశారు. తద్వారా దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ వన్ సీఎంగా గుర్తింపు పొందారని ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలలో స్థాయి ఉన్నోడు, లేనోడు, దొంగలకు సద్ది మూటలు మోసేవారు ఓర్వలేక పోతున్నారని దుమ్మెత్తి పోశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 51,094 ఓట్ల మెజారిటీ లభించగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం లక్ష ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు.



Next Story

Most Viewed