వంద పడకల ప్రభుత్వాసుపత్రికి రూ.35 కోట్ల ప్రతిపాదనలు

by Disha Web Desk 15 |
వంద పడకల ప్రభుత్వాసుపత్రికి రూ.35 కోట్ల ప్రతిపాదనలు
X

దిశ,తుంగతుర్తి : నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు కోసం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కృత నిశ్చయంతో పని చేస్తున్నారని తుంగతుర్తి టిఆర్ఎస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గతంలోనే శాసనసభలో ప్రసంగించిన వీడియో క్లిప్ ని కూడా పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య మంగళవారం విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 30 పడకల స్థాయిని వంద పడకల పెంపు కోసం రూ.35 కోట్లు ఖర్చుతో ప్రతిపాదనలు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిపై పలుమార్లు సంబంధిత శాఖ మంత్రి హరీష్ రావును కలిసినట్లు వివరించారు. తుంగతుర్తి నియోజకవర్గం యాదాద్రి భువనగిరి,నల్లగొండ,సూర్యాపేట జిల్లాలలో విస్తరించడంతోపాటు దీని పరిధిలో 122 గిరిజన తండాలు ఇమిడి ఉన్నాయనే విషయాన్ని ఎమ్మెల్యే శాసనసభలో ప్రస్తావించారని తెలిపారు. అంతేకాకుండా మోత్కూర్ లో ఆసుపత్రి ఏర్పాటు గురించి మాట్లాడినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా 2014 ముందు తుంగతుర్తి ఎలా ఉందో..? తరువాత పరిస్థితులు ఎలా ఉన్నాయో..? ప్రజలంతా గ్రహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి బీజేపీ నేతలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని ఆరోపించారు.


Next Story

Most Viewed