ఎమ్మార్వో టు సెక్రటేరియట్​ అస్తవ్యస్త పాలన!

by Disha Web Desk 4 |
ఎమ్మార్వో టు సెక్రటేరియట్​ అస్తవ్యస్త పాలన!
X

ప్రజలకు సుపరిపాలన అందిస్తామని పలు వేదికలపై సీఎం కేసీఆర్​గంభీరమైన ప్రకటనలు చేస్తున్నా.. అవినీతి మరకలు, పాలనా పరమైన లోపాలు ప్రభుత్వ తీరును వేలెత్తి చూపుతున్నాయి. పారదర్శక పాలన కోసమే కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు అని చెబుతున్నా.. అందుకు అవసరమైన సంఖ్యలో సిబ్బందిని నియమించకపోవడంతో ఆయా జిల్లాల్లో పాలన గాడితప్పింది.

రాష్ట్రంలో కొత్తగా టాస్ (తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్) ఏర్పాటు చేస్తానని పలుసార్లు ప్రకటించినా.. అది అమల్లోకి రాలేదు. ధరణి కోసం తెచ్చిన సంస్కరణలు అట్టర్ ఫ్లాప్​అయ్యాయి. ఇరిగేషన్, అర్ అండ్ బీ‌తో పాటు పలు శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేశారు. కానీ ఆ శాఖలతో పాటు ఇతర శాఖల్లో నెలకొన్న అవినీతిని అంతం చేయలేదు. మొత్తంగా సీఎం కేసీఆర్ తెచ్చిన పాలనాపరమైన సంస్కరణల్లో అధికశాతం విఫలం అయ్యాయనే విమర్శలు ఉన్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు.. కొత్త కలెక్టరేట్లను నిర్మించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ జిల్లాలకు కావాల్సిన అధికారులను మాత్రం రిక్రూట్ చేయలేదు. దీంతో ఒక్కో అధికారి రెండు మూడు జిల్లాలకు ఇన్ చార్జీలుగా పనిచేస్తున్నారు. వారంలో రెండు రోజులు ఓ జిల్లా ఆఫీసులో ఉంటే మరో రెండు రోజులు మిగతా జిల్లా కలెక్టరేట్ లో పనులను చేస్తున్నారు. ఆలాగే కొత్త మండలాల్లోనూ అదే పరిస్థితి నెలకొన్నది. అధికారులు ఎప్పుడు వస్తారో అంటూ ప్రజలు ఆఫీసుల చుట్టూ రోజూ తిరగాల్సి వస్తున్నది.

ఊసే లేని టాస్ సర్వీస్

రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ అడ్మిస్ట్రేషన్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ పలుసార్లు ప్రకటించారు. కానీ, ఇంతవరకు అందుకు కావాల్సిన కసరత్తు జరగలేదు. ఆ మధ్య ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ ప్రాథమిక కసరత్తు చేసినా.. సీఎం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో దాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తున్నది. గ్రూప్1 నోటిఫికేషన్ ఆలస్యం కావడానికి టాస్ కూడా ఓ కారణం అనే ప్రచారం ఉంది.

ఏటా పెరుగుతున్న ఏసీబీ కేసులు

రాష్ట్రంలో ప్రతి శాఖలో అవినీతి నెలకొంది. లంచాలు ఇవ్వందే పని కాదని విమర్శలు ఉన్నాయి. ఈ జాఢ్యం గ్రామస్థాయి నుంచి మొదలుకుని సెక్రటేరియట్ వరకు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు లక్షల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి ఏటా ఏసీబీ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలకు సుపరిపాలన అందుతుంటే మరి ఏసీబీ కేసుల్లో ఉద్యోగులు ఎలా ఇరుక్కుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రతి పనికి ఓ రేటు

ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేశారు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో విపరీతమైన దోపిడీ జరుగుతున్నదని టాక్. బర్త్, డెత్​, రెవెన్యూ సర్టిఫికెట్లకు ఒక్కో రేటు ఫిక్స్​ చేసి వసూలు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ధ్రువపత్రాల జారీకి ఆలస్యం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక అగ్రికల్చర్ లాండ్ రిజిస్ట్రేషన్లను ఎమ్మార్వో పరిధిలోకి తెచ్చారు.

కానీ, మామూళ్లకు మాత్రం బ్రేకులు పడలేదు. భూ విస్తీర్ణం, ప్రాంతం మేరకు ఎకరాకు ఇంత మొత్తంలో లంచం ఇవ్వాలని షరుతులు పెట్టి వసూలు చేస్తున్నారు. ఇక మున్సిపల్ శాఖలో అవినీతి లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన టీఎస్ బీ పాస్ పేరుకే పరిమితమైంది. టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలో మాదిరిగానే లంచాలు డిమాండ్ చేస్తున్నారని స్వయంగా ఆ శాఖకు చెందిన ఆఫీసర్లే మాట్లాడుకుంటున్నారు.

సెక్రటేరియట్ లో సైతం..

సెక్రటేరియట్ కు వచ్చిన ఫైల్ క్లియర్ కావాలంటే రాజకీయ సిఫారసులు ఉండాలి. లేకపోతే ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే. ఇవేవి లేకపోతే ఫైల్ ను క్లియర్ చేయకుండా పెట్టుకోవడం, కుదరకపోతే దానిపై కొర్రీలు వేయడం ఆనవాయితీగా మారిందని విమర్శలు ఉన్నాయి. హెచ్ఓడీ వరకు ఎంత కొంత మొత్తంలో లంచం ఇచ్చుకుని ఫైల్ క్లియర్ చేయించుకున్నాక.. సెక్రటేరియట్ లోనూ ఫైల్ పై సంతకం పడాలంటే పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిందేనని డిమాండ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అవినీతికి కేరాఫ్​ రిజిస్ట్రేషన్ శాఖ

రిజిస్ట్రేషన్ శాఖలో లంచాలు ఇవ్వనిదే పనికాదని విషయం బహిరంగ రహస్యం. ప్రతి రిజిస్ట్రేషన్ కు ఎంత ఇవ్వాలో ముందుగానే ఫిక్స్ చేస్తారు. అంత ఇవ్వందే సబ్ రిజిస్ట్రార్లు సంతకం పెట్టరనే ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో రిజిస్ట్రేషన్ వాల్యూలో ఒక్క శాతాన్ని వసూలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు ఆదాయానికి అంతు లేదని మిగతా ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

హెచ్ఎండీఏ కాసుల పంట

హెచ్ఎండీఏలో పనిచేసే అధికారుల సంపాదనకు అడ్డులేదని విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ ఎంత విస్తరిస్తుంటే, ఆ సంస్థలో పనిచేసే అధికారుల సంపాదనకు అంతగా విస్తరిస్తుందనే సెటైర్లు ఉన్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ల అనుమతుల కోసం వెళ్తే లక్షల్లో ముట్టుచెప్పాల్సిందనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులకు ఎలా అనుకూలంగా మలిచి ఫైల్ క్లియర్ చేయాలో మరి సలహాలు ఇచ్చి, డబ్బులు తీసుకుంటారనే ప్రచారం ఉంది.

మారని జీహెచ్ఎంసీ తీరు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ సంస్థలో పనిచేసే అధికారుల తీరు మార్చుతామని, అవినీతి చేసే అధికారులను బదిలీ చేస్తామని ఆ శాఖ మంత్రి కేటీఆర్ చాలాసార్లు హెచ్చరించారు. కానీ అధికారులు మాత్రం గ్రేటర్ పరిధిలో నిర్మించే భవనాల అనుమతులకు లక్షల్లో ముట్టచెప్పితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఈ దోపిడీకి లోకల్ గా ఉండే బీఆర్ఎస్ కార్పొరేటర్లు, లీడర్ల సపోర్టు ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి.

పైసలు ఇస్తేనే నల్లా కనెక్షన్

హైదరాబాద్ వరకు వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. నల్లా కనెక్షన్లు కోసం అధికారికంగా కట్టాల్సిన డీడీతోపాటు సదరు ఆఫీసర్ కు కొంత మొత్తంలో లంచం ఇవ్వాల్సిందే. లేకపోతే ఏదో ఒక వంకతో కనెక్షన్ కోసం పెట్టుకున్న దరఖాస్తును పక్కన పెట్టడం అనవాయితీగా వస్తున్నది. ఇక పెద్ద పెద్ద అపార్ట్ మెంట్స్, విల్లాల నిర్మాణాలకు నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తులు వస్తే ఆ సంస్థ అధికారులు తెగ సంబర పడుతారని టాక్ ఉంది.

ట్రాన్స్​కోలో జీతాలు.. లంచాలు ఎక్కువే

విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల కంటే జీతాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ సంస్థలో లంచాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయని టాక్. వ్యవసాయానికి కొత్త కనెక్షన్ ఇవ్వాలంటే లంచం ఇవ్వందే పనికాదు. అలాగే ట్రాన్స్​ఫార్మర్​ చెడిపోయినా, కాలిపోయిన రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తుంటారు. ఇక సిటీల్లో అపార్ట్ మెంట్స్ కోసం విద్యుత్ కనెక్షన్​ ఇవ్వాలంటే లక్షల్లో లంచాలు అడుగుతారనే ఫిర్యాదులు ఉన్నాయి.

ప్రజల బాధలు వినేది లేదు

ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ప్రజలను నేరుగా కలిసేవారు. అందుకోసం ప్రతిరోజూ అందుకు కొంత సమయం కేటాయించేవారు. ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను తీసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపేవారు. కానీ, కేసీఆర్ మాత్రం ప్రజలను కలిసేందుకు ఇష్టపడరనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా పర్యటలనకు వెళ్లినప్పుడు సైతం ప్రజలను నేరుగా కలిసిన సందర్భాలూ లేవు.

చివరికి వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రజలు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినా పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో జనహిత పేరుతో ఓ బిల్డింగ్ నిర్మించారు. అందులో వివిధ వర్గాల ప్రజలతో సీఎం నేరుగా మాట్లాడతారని గొప్పగా ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు కేవలం రెండు, మూడు సార్లు మినహా అందులో సాధారణ ప్రజలతో మాట్లాడిన దాఖలాలు లేవు.


Next Story

Most Viewed