కేసీఆర్ మళ్లీ సీఎం అయితే PRC దేవుడెరుగు.. అసలు జీతాలకే ఎసరు: బండి సంజయ్ ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్ మళ్లీ సీఎం అయితే PRC దేవుడెరుగు.. అసలు జీతాలకే ఎసరు: బండి సంజయ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అన్నదే ఉద్యోగ, ఉపాధ్యాయులు నినాదంగా పెట్టుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించి మోసం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని, దేశమే ఆశ్చర్యపోయేలా పే స్కేల్ ఇస్తానని సాక్షాత్తు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్.. ఇచ్చిన మాట పూర్తిగా తప్పారని ధ్వజమెత్తారు. గడువు ముగిసిన 3 నెలల తరువాత నూతన వేతన సవరణ సంఘాన్ని నియమించిన కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 శాతం మాత్రమే మధ్యంతర భృతి ఇస్తున్నట్లు ప్రకటించి వారికి అన్యాయం చేశారన్నారు.

ఇప్పటికే ఉద్యోగులకు 3 డీఏలు(10.92 శాతం) పెండింగ్‌లో ఉండగా 5 శాతం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని, పదేపదే మొత్తుకున్న కేసీఆర్.. స్వరాష్ట్రం వచ్చాక కేవలం 5 శాతం మధ్యంతర భృతి ఇవ్వడాన్ని ఏమనుకోవాలని బండి ప్రశ్నించారు. కేసీఆర్ పాలనా పుణ్యమా? అని 317 జీవో పేరుతో స్వరాష్ట్రంలోనే ఉద్యోగులు స్థానికేతరులుగా మారి చెట్టుకొకరు పుట్టకొకరుగా బతుకీడుస్తున్నారని బండి ఆవేదన వ్యక్తంచేశారు. బదిలీలు, ప్రమోషన్లు లేక అల్లాడుతున్నారన్నారు. ఏటా ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో పనిభారం ఎక్కువై ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ తరుణంలో 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించడం.. ఉద్యోగులను మరింత నిరాశ, నిస్ప్రహల్లోకి నెట్టివేయడమే అవుతుందన్నారు. ప్రభుత్వానికి భజన చేసే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని బండి సూచించారు. రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచిన కేసీఆర్ పాలనలో ప్రస్తుతం ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితే లేదని, పొరపాటున మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పీఆర్సీ అమలు దేవుడెరుగు 3, 4 నెలలకోసారి జీతాలు కూడా ఇవ్వలేని దుస్ధితి ఏర్పడే ప్రమాదం లేకపోలేదన్నారు. ఉద్యోగులు.. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని బండి సంజయ్ సూచించారు.

ట్విట్టర్ టిల్లు నారాజ్

తెలంగాణలో కారు గ్యారేజీకి పోతోందని ట్విట్టర్ టిల్లు నారాజ్ అవుతున్నాడని బండి ట్వీట్ చేశారు. నిజామాబాద్‌లో చెల్లి ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నాడని ఎద్దేవాచేశారు. కానీ దాని వల్ల ఏం ఫాయిదా? అని, తొమ్మిదేళ్ల దొంగ హామీల దొంగ జపం బట్టబయలైందని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌ డల్లాస్‌ కాలేదని, కనీసం బస్టాండ్‌ కూడా రాలేదని చురకలంటించారు. వరదలు, బురదలు బోనస్‌గా మారాయన్నారు. నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలేదని, 100 కుటుంబాలు కూడా బాగుపడలేదని ట్వీట్ చేశారు.

100 ఏళ్లకు సరిపడా దోపిడీ మాత్రం జరిగిందని ఆరోపణలు చేశారు. ఆదిలాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లు రాలేదని, కనీసం అంబులెన్స్‌ పోయే తోవ కూడా వేయలేదని రాష్ట్ సర్కార్‌పై బండి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతి లేక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు మాత్రం ఎక్కువయ్యాయని విరుచుకుపడ్డారు. కరీంనగర్‌ లండన్ కాలేదని, వేములవాడకు ఏటా రూ.100 కోట్లు అందలేదని, కొండగట్టు అంజన్న ఘాట్‌రోడ్డు గతి మారలేదని, గులాబీ కబ్జాకోర్లు, కీచకులు మాత్రం పెరిగారని బండి విమర్శలు గుప్పించారు.

లక్ష ఉద్యోగాలు, రూ.3000 భృతి ఇవ్వలేదని, రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, పోడు పంచాయతీ పోలేదని పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో కల్వకుంట్ల ఖజానా మాత్రం నిండిందని ఆరోపించారు. కల్వకుంట్ల భజనకారులకు కోట్ల కమీషన్లు అందినయి తప్ప.., కష్టపడి కొట్లాడిన తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదని ట్వీట్ చేశారు. తొమ్మిదేండ్లు గాడిద పండ్లు తోమి, ఇప్పుడు గాయి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని, దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లిందని బండి తన ట్వీట్ ద్వారా హెచ్చరించారు.

Next Story