సీఎం కేసీఆర్‌ను జనం జోకర్‌లా చూస్తున్నారు: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్

by Disha Web Desk 19 |
సీఎం కేసీఆర్‌ను జనం జోకర్‌లా చూస్తున్నారు: T-బీజేపీ చీఫ్ బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను గౌరవించాలని, లేదంటే రాజ్యాంగ ద్రోహిగా, ప్రజాస్వామ్య ద్రోహిగా చరిత్రపుటల్లో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి మిగిలిపోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. గణతంత్ర వేడుకలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరేడ్‌తో కూడిన గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాల్సిందేనంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాజ్యాంగంపై, న్యాయ స్థానాలపై కేసీఆర్‌కు ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ ఉత్తర్వులను అమలుచేయాలని బండి డిమాండ్ చేశారు. పరేడ్ గ్రౌండ్‌లోనే గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. పరేడ్ గ్రౌండ్ లో ప్రతి ఏటా నిర్వహించే గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమన్నారు.

అంబేద్కర్‌ను అవమానించడమేనని విమర్శలు చేశారు. గవర్నర్‌కు దక్కాల్సిన ప్రోటోకాల్‌ను కేసీఆర్ పాటించడం లేదని, అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను ఆహ్వానించకుండా అవమానించారన్నారు. కరోనా సాకు చూపి రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించలేమని చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నారని, కేసీఆర్‌ను జోకర్‌లా చూస్తున్నారన్నారు. కేసీఆర్.. ఇతర రాష్ట్రాల సీఎంలను పిలిపించుకుని గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలైతే పౌరులకు స్వేచ్ఛ ఉండదని, ఎన్నికలను రద్దు చేస్తారని, ప్రజలకు ఓటు హక్కు కూడా తీసేస్తారమోనని బండి ఎద్దేవా చేశారు. ప్రమాదకర కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ప్రపంచంలోనే అత్యుతున్న ప్రజాస్వామ్యాన్ని అందించిన అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? అనేది ప్రజలు ఆలోచించాలని బండి సూచించారు.


Next Story

Most Viewed