రెండో రోజు ఈడీ ముందుకు కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం

by Disha Web Desk 13 |
రెండో రోజు ఈడీ ముందుకు కిషన్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశీ మారక ద్రవ్య చట్టం ఉల్లంఘన, మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని ఈడీ (ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు బుధవారం పది గంటల పాటు ప్రశ్నించారు. ఈ ఆరోపణలకు సంబంధించి మంగళవారం సుమారు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు బుధవారం కూడా హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. రాత్రి 8.30 గంటల వరకూ ప్రశ్నించారు.

బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలతో పాటు ఆర్థిక లావాదేవీల పై ప్రశ్నల వర్షం కురిపించారు. విదేశాల నుంచి డాలర్ల రూపంలో వచ్చిన డబ్బు మూలాలు, వాటిని తిరిగి ఎక్కడకు బదిలీ చేసింది, వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడితే ఆ కంపెనీలు ఏవి.. ఇలా అనేక కోణాల్లో ఈడీ అధికారులు వివరాలను సేకరించారు.

ఇరవై ఏండ్ల క్రితం వ్యాపారానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించిన ఈడీ అధికారులు అప్పటి ఆర్థిక లావాదేవీల పై పూర్తి వివరాలను రాబట్టినట్లు తెలిసింది. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన డబ్బు విషయంలో ఫెమా ఉల్లంఘనలు జరిగాయన్నది ఈడీ అనుమానం. వాటిని నివృత్తి చేసుకోవడానికి అప్పటి బ్యాంకు ఖాతాలు, డబ్బు బదిలీ తదితరాలను లోతుగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఏయే కంపెనీల మధ్య లావాదేవీలు జరిగాయనే అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో రెండు రోజుల పాటు ఈడీ అధికారులు దాదాపు 19 గంటల పాటు ప్రశ్నించడం అనేక అనుమానాలకు దారితీసింది. రాజకీయ చర్చలకు కారణమైంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందింది.. లేనిదీ వెల్లడి కాలేదు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ మాజీ సీఈఓ విజయ్ నాయర్‌ను ఆగస్టు నుంచి ఆరుసార్లు ఎంక్వయిరీ కోసం పిలిచి చివరి రోజున ఏడు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అరెస్ట్ చేసింది. కోర్టులో హాజరుపరిచి ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నది.

అదే తీరులో ఇదే స్కామ్‌లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండో స్పిరిట్స్ అధినేత సమీర్ మహేంద్రు ను సైతం పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు బుధవారం ఉదయం అరెస్టు చేసి తొమ్మిది రోజుల కస్టడీకి కోర్టు నుంచి అనుమతి పొందారు. ఈ రెండు ఉదంతాలతో పోల్చుకుంటున్న టీఆర్ఎస్ వర్గాలు, నియోజకవర్గంలోని ఆయనకు సన్నిహితులైన వారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యవహారంలోనూ ఈడీ చివరకు ఏం చేయబోతున్నదనే ఆందోళనకు గురవుతున్నారు.


Next Story

Most Viewed