బీజేపీ త్రాచు పాములాంటిది.. దేశానికి ప్రమాదకరం: ఎమ్మెల్యే కూనంనేని ఫైర్

by Satheesh |
బీజేపీ త్రాచు పాములాంటిది.. దేశానికి ప్రమాదకరం: ఎమ్మెల్యే కూనంనేని ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆర్థిక భారానికి కేసీఆర్ పాపాలే కారణమని, అందుకే అప్పుల కుప్పగా మారిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం ముగ్దుమ్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అప్పులు చేసి అధికారం నుంచి కేసీఆర్ దిగిపోయి అదృష్టవంతుడయ్యారని, రాష్ట్ర ఆర్థిక బరువును కాంగ్రెస్ ప్రభుత్వంపైన వేశారని విమర్శించారు. రాష్ట్రంలోని ఆర్థిక భారమంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. విద్యుత్, ఇతర బకాయిలు చెల్లించే పరిస్థితులు లేవని, కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉన్నదని దీంతో రాష్టానికి అప్పులు గుదిబండగా మారిందన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో మేథావులు, రాజకీయ పార్టీల సలహలు, సూచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సూచించారు. భూముల వేలం పేరుతో గత ప్రభుత్వంలో కోట్ల రూపాయాలను మింగేశారని విమర్శించారు. కాళేశ్వరం వద్ద పాత ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాలన్నారు. కొత్త ప్రాజెక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు సంయమనం, ఓర్పు కావాలని, అందరితో మాట్లాడి ముందుకు వెళ్లాలని సూచించారు.

వరి వేస్తే ఊరి అని చెప్పిన కేసీఆర్‌కు వ్యవసాయం విషయంలో మాట్లాడే హక్కు లేదన్నారు. సన్నబియ్యానికి సబ్సిడీ ఇచ్చి, మిగతావారికి సబ్సిడీ ఇవ్వకపోవడం సబబు కాదని, మిగిలిన వడ్లు పండించిన రైతాంగాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నదన్నారు. క్వింటాకు రూ.500ల సబ్సిడీ అమలు ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సన్నం బియ్యం పండించేందుకు అన్ని భూములకు అనుకూలంగా ఉండబోవని, అందుకే దొడ్డు బియ్యం వైపు రావాల్సి వస్తుందని, దీనిని ఎలా పరిష్కరించాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.

బీజేపీ ఒక త్రాచు పాము లాంటిదని, దీనికి తలతో పాటు తోకలో కూడా విషం ఉంటుందని విమర్శించారు. ఆ పార్టీది దేశాన్ని ఖండఖండాలుగా విభజించే రాక్షస, షాడిస్టు ఆలోచన విధానమని దుయ్యబట్టారు. ఏదో ఒక పేరుతో హిందూ, ముస్లింల విభజన తీసుకొచ్చి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. శ్రీరాముని కళ్యాణం జరగకుండానే శ్రీరామ నవమికి ముందే తలంబ్రాలు పంచడం పాపమన్నారు. ముందే తలంబ్రాలు పంచడం అంటేనే ఓట్ల కోసం కాదా..? అని ప్రశ్నించారు. క్రిస్టియన్, ముస్లిం పాలనలో కూడా హిందూలకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఇప్పుడు మోదీ ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు ప్రజలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.

Next Story