భట్టి విక్రమార్కతో అక్బరుద్దీన్ ఒవైసీ భేటీ

by Disha Web Desk 2 |
భట్టి విక్రమార్కతో అక్బరుద్దీన్ ఒవైసీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయం రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. బడ్జెట్ సెషన్ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాశం అవుతోంది. ఈ భేటీలో ఏం చర్చించారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారినప్పటికీ ఈ ఇరు పార్టీల నేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తావిస్తోంది. ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ పడింది. అసెంబ్లీ వాయిదా తర్వాత భట్టి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డితో అక్బరుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. కాగా రాజశేఖర్ రెడ్డి హాయాంలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మిత్రపక్షంగా ఉన్నాయి. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ రెండు పార్టీల మధ్య పొరపచ్చాలు ఏర్పడ్డాయి.

రాష్ట్ర విభజన అనంతరం బీఆర్ఎస్‌కు మిత్రపక్షంగా కొనసాగుతోంది. అయితే రెండు రోజుల క్రితం అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీకి మంత్రి కేటీఆర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని 15 మంది ఎమ్మెల్యేలతో తమ పార్టీ అసెంబ్లీలో అడుగుపెడుతుందని ఒవైసీ సవాల్ చేశారు. మంత్రి కేటీఆర్‌కు సవాల్ చేసిన రెండు రోజులకే అనూహ్యంగా కాంగ్రెస్ నేతలతో ఎంఐఎం భేటీ కావడం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోందనే చర్చ జోరుగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎంఐఎం జత కడుతుందా? అందులో భాగంగానే తన మిత్రపక్షంపై కోపాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ వైపు ఎంఐఎం అడుగులు వేస్తోందా అనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే గనుక ఎంఐఎం షాక్‌తో కేసీఆర్‌కు నష్టం ఏ మేరకు ఉండబోతోందనేది చర్చగా మారింది.


Next Story