Minister Thummala: తెలంగాణ రైతులకు దసరా కానుక

by Gantepaka Srikanth |
Minister Thummala: తెలంగాణ రైతులకు దసరా కానుక
X

దిశ, వెబ్‌డెస్క్: పామాయిల్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించే విధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌(Shivraj Singh Chauhan)ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇందుకనుగుణంగా కేంద్రప్రభుత్వం ఇటీవల ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5.5 % నుండి 27.5 %కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనివలన ముడిపామాయిల్ గెలల ధర రూ.14,392 నుండి అమాంతం రూ.2651 పెరిగి ప్రస్తుతం రూ.17,043 చేరుకుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి. దీనివలన రైతులకు ఈ నెలలో అదనంగా రూ. 12 కోట్లు లబ్ధి చేకూరనుంది.

గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వలన ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశ పడడమే కాకుండా, కొత్తగా ఆయిల్ పామ్ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రి పేర్కొన్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని, ఇటీవల మన రాష్ట్రానికి విచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను కలిసి పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ చొరవతో సెప్టెంబర్ 13న కేంద్ర ప్రభుత్వం ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుండి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి రావడం వస్తుందని అన్నారు. ఈ ధరల పెరుగుదల వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పామ్ ఆయిల్ దిగుమతిపై కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు(Telangana farmers) ప్రయోజనం పొందుతారని, అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వలన నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడే అవకాశం ఉంటుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు 2.23 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకొచ్చినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed