‘రైతుల నోట్లో మట్టి కొట్టారు’.. బీఆర్ఎస్‌పై తుమ్మల తీవ్ర ఆగ్రహం

by Satheesh |
‘రైతుల నోట్లో మట్టి కొట్టారు’.. బీఆర్ఎస్‌పై తుమ్మల తీవ్ర ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వరివేస్తే ఉరి అన్నది మీరు కాదా..? సన్నాలు సాగు చేయాలని తర్వాత రైతుల నడ్డి విరిచింది మీరు కాదా..? అని బీఆర్ఎస్ నాయకుల తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమా ఎత్తేసి గత ఐదు సంవత్సరాలలో రైతుల నోట్లో బీఆర్ఎస్ మట్టి కొట్టిందని మండిపడ్డారు. రైతుబంధును మధ్య మధ్యలో ఆపింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నంచారు. పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ కూడా విడుదల చేయకుండా బకాయిలు పెడితే, ఇప్పుడు మేము వాటిని సరిచేస్తూ, సరఫరా చేయిస్తుంటే సన్నాయి నొక్కులు నొక్కుతున్నది మీరు కాదా అని ప్రశ్నించారు.

రైతుబంధు పేరిట అన్ని పథకాలకు బీఆర్ఎస్ తిలోదలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచింగ్ గ్రాంటు నిధులు విడుదల చేయకుండా, కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా చేసి, రైతుల ఉసురు పోసుకున్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. 2014 రుణమాఫీ నాలుగు విడతలుగా, 2015 రుణమాఫీ సగం చేసి బీఆర్ఎస్ చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలు అంత బాగుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు మిమ్మల్ని ఎందుకు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారో ఆలోచించుకోవాలన్నారు. గతంలో వడ్లలో 10-12 కేజీల తరుగు తీశారని గుర్తు చేశారు. ఒక పక్క రాష్టాన్ని అప్పులపాలు చేసి, పెరిగిన కరెంట్ వినియోగానికి తగ్గట్లు విద్యుత్‌ను కొని పంటలను తమ ప్రభుత్వం కాపాడిందన్నారు.

ఎక్కువ పీపీసీ సెంటర్లను తెరిచి కొనుగోళ్లను ముందుగానే ఆరంభించమని పేర్కొన్నారు. రాష్టాన్ని ఆర్థికంగా దివాళా తీయించినా, రైతుబంధును పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరిచిందన్నారు. గత ఏడాదికంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. పంటలభీమా పథకాన్ని తాము తీసుక వచ్చామని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు మొరగటం మానేసి.. వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రవర్తిస్తే మంచిదని హితవు పలికారు. బీఆర్ఎస్ నాయకులు మొరుగుతున్నారు అంటే అవి రైతులకు వక్రీకరించడం వాళ్ళ నీత్గి మాలిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు మాటలను వక్రీకరించి వాళ్ళ స్థాయిని దిగజార్చుకోవద్దని సలహా ఇచ్చారు.

Next Story