Minister Sridhar Babu:‘లగచర్ల ఘటనను తేలిగ్గా తీసుకోం’.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-11-14 15:05:42.0  )
Minister Sridhar Babu:‘లగచర్ల ఘటనను తేలిగ్గా తీసుకోం’.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికాకుండానే లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. 141 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, 35,820కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేశీయ, బహుళజాతి కంపెనీలు ఔషధ, టీకా, లైఫ్ సైన్సెస్, పరిశోధన రంగాల్లో నిర్మాణాలు ప్రారంభించాయని, ఉత్పాదన మొదలు పెట్టే దశల్లో ఉన్నాయన్నారు. ఈ కంపెనీలతో ప్రత్యక్షంగా 51,086 మందికి, మరో లక్షన్నర మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. దేశంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువు అయిందన్నారు. రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినప్పుడే కాలుష్య నియంత్రణ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా నిబంధనలు విధించనున్నట్లు వెల్లడించారు. జపాన్‌కు చెందిన టకెడా లైఫ్ సైన్సెస్ సంస్థ స్థానిక బయోలాజికల్ ఇ(బీఈ)తో కలిసి ఏటా 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద పశు వైద్య సంస్థ జోయెటిస్ ఇటీవలే జీసీసీని ప్రారంభించిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అమ్ జెన్ 3,000 మందికి ఉద్యోగులను నియమించుకునే జీసీసీని ప్రారంభించిందని వివరించారు. జోయెటిస్, అమ్ జెన్ సంస్థలు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఒప్పందాలు చేసుకుని అతి కొద్ది కాలంలోనే జేసీసీ సెంటర్లను ఏర్పాటు చేశాయని వెల్లడించారు. వచ్చే రెండు నెలల్లోనే లైఫ్ సైన్సెస్ కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలకు సంబంధించిన విధాన ప్రకటన సీఎం చేయనున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా దీనికి సంబంధించిన పాలసీ రూపొందించలేదని తెలిపారు.

ఫార్మా క్లస్టర్ భూ సేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి, వారు అంగీకరించిన తర్వాతే పనులు చేపడతామని స్పష్టం చేశారు. సమస్యలేమైనా ఉంటే రైతులు అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రతిపక్షాల కుట్రలకు, రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదని హెచ్చరించారు. పదేళ్లలో తామెన్నడూ అధికారుల పైన దాడులకు ఉసిగొల్పే కుట్రలకు పాల్పడలేదన్నారు. అభివృద్దిని అడ్డుకోవాలని చూసే ఏ శక్తిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. లగచర్ల ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తేలిగ్గా తీసుకోబోమని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల కుట్రలో భాగంగానే అధికారులపై దాడి జరిగిందని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed