పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు

by Ajay Maddhiboyina |

పారిశ్రామికవేత్తలు కేవలం పెట్టుబడిదారులు కాదని.. రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పారిశ్రామికవేత్తలు కేవలం పెట్టుబడిదారులు కాదని.. రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026 ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భావితరాల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తు కోసం ఎదురుచూడకుండా, దాన్ని నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, డీప్-టెక్ వరకు తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.

పరిశ్రమ 4.0 విప్లవంలో భాగంగా దూసుకొస్తున్న ఆటోమేషన్, డీప్-టెక్ సవాళ్లను ఎదుర్కొనేలా రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అదే సమయంలో.. భవిష్యత్తు తరాలకు మేలు జరిగేలా స్థిరమైన, పర్యావరణహిత పారిశ్రామిక వృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పారిశ్రామికాభివృద్ధి అనేది కేవలం భూమి, మూలధనంపైనే కాకుండా.. మేధో సంపత్తి, నాలెడ్జ్ ఎకానమీ ఆధారంగానే సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను స్కిల్ క్యాపిటల్‌గా మార్చాలనే సంకల్పంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకొచ్చి... ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ ప్రతినిధులు రవికుమార్, కేకే మహేశ్వరి, శ్రీనివాస్ గరిమెల్లా, భాస్కర్ రెడ్డి, అనిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story