జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీ పై మంత్రి పొంగులేటి హామీ

by Taduka Kalyani |

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ - హెచ్ - 2843) ఖమ్మం జిల్లా కమిటీ విజ్ఞప్తిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు.

జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీ పై మంత్రి పొంగులేటి హామీ
X

దిశ,ఖమ్మం బ్యూరో : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ - హెచ్ - 2843) ఖమ్మం జిల్లా కమిటీ విజ్ఞప్తిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 % ఫీజు రాయితీ కల్పించాలని టీ డబ్ల్యూ జేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ స్థానిక ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో మంగళవారం వినతిపత్రం సమర్పించింది. దీనిపై స్పందించిన మంత్రి జిల్లా కలెక్టర్, డీఈవోలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. టీడబ్ల్యూజేఎఫ్ వినతిపత్రాన్ని కలెక్టర్ కు పంపాల్సిందిగా తన వ్యక్తిగత సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. జర్నలిస్టుల్లో చాలామంది పేదలు, మధ్యతరగతి వర్గానికి చెందినవారని, చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని టీడబ్ల్యూజేఎఫ్ వినతిపత్రంలో పేర్కొంది. అనేక మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి వారిని అవకాశం ఉన్న మేరకు ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నదని జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్ తెలిపారు.‌ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు సామాన్యుడికి అందుబాటులో లేవని అన్నారు.‌ ఈ నేపథ్యంలో జర్నలిస్టులు తమ పిల్లలను చదివించుకోవటం భారం అవుతోందని పేర్కొన్నారు . ప్రతీ ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో సెక్షన్ కు నలుగురు చొప్పున పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించాలనే నిబంధన ఉన్నా ఏ ఒక్కచోటా ఇదీ సక్రమంగా అమలు అవుతున్న దాఖలాలు లేవన్నారు. పేద, మధ్యతరగతి వర్గానికి చెందిన జర్నలిస్టుల పిల్లల విషయంలోనైనా ఇదీ అమలయ్యేలా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రతీ ప్రైవేటు, కార్పొరేటు పాఠశాల, కళాశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇచ్చేలా... సమాచార శాఖ మంత్రిగా ప్రభుత్వం తరఫున ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరడంతో ఈ మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రభుత్వం నుంచి తగు ఆదేశాలు జారీ చేయిస్తానని మంత్రి స్పష్టతనిచ్చారు. మంత్రికి వినతి పత్రం సమర్పించిన వారిలో టీబీజేఏ జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు మారెడ్డి నాగేందర్ రెడ్డి, మధుశ్రీ, జానీపాష, యాకేష్, గణేష్, పెండ్ర అంజయ్య, కొమిరె నాగేశ్వరరావు, అర్షద్, ఫయాజ్, యాకూబ్ పాష, శరత్, యూసుఫ్, యాస లక్ష్మారెడ్డి, డి. రవికుమార్, కొరకొప్పుల రాంబాబు, కరణబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story