గుంటభూమి ఎక్కువ ఉన్నా రాజీనామా చేస్తా: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 12 |
గుంటభూమి ఎక్కువ ఉన్నా రాజీనామా చేస్తా: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఈ మూడు వ్యవసాయ క్షేత్రాలకు రఘునందన్ రావుకు నచ్చినవాళ్లతో, నచ్చిన సర్వేయర్‌ను తీసుకుని రేపే వెళ్లొచ్చు .. లేదా, ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి సర్వే చేయించుకోవడానికి అంగీకరిస్తున్నాను. న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను మా పిల్లలు వదిలేస్తారు. నేను నా పదవికి రాజీనామా చేస్తాను. లేకుంటే నువ్వు అక్కడే నీ పదవికి రాజీనామా చేసిపోవాలి’ అని మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మీడియా ప్రకటన విడుదల చేశారు.

కనీస సమాచారం లేకుండా రఘునందన్ రావు ఆరోపణలు చేయడం అవివేకం అన్నారు. దురుద్దేశపూర్వక ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రఘునందన్ రావు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే చట్టబద్ధమైన చర్యలకు సిద్దంగా ఉండాలన్నారు. స్వగ్రామం పాన్‌గల్‌లో నాకు ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నవేనని.. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది నా సతీమణి సొంత డబ్బులు, బ్యాంకులోనుతో కట్టుకున్న ఇల్లు అన్నారు. విదేశాల్లో చదువుకుని, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న మేజర్లు అయిన మా ఇద్దరు అమ్మాయిలు స్వార్జితంతో చండూరులో సురవరం ప్రతాపరెడ్డి వారసుల నుండి, ఇతరుల నుండి చట్టబద్దంగా భూములు ఖరీదు చేశారని అన్నారు.

ఎస్టీల పేరు మీద కొని తర్వాత మార్చుకున్నారని రఘునందన్ రావు ఆరోపణల్లో నిజం లేదన్నారు. తల్లితండ్రులను కోల్పోయిన పసిబాలుడు గౌడ నాయక్‌ను చేరదీసి ఇంట్లో పెట్టుకుని పెంచి పెద్దచేసి ఉన్నత చదువులు చదివించింది వనపర్తి నియోజకవర్గం అంతా తెలుసునని, తను మా కుటుంబసభ్యుడే.. ప్రస్తుతం ఇంటి వ్యవహారాలు చూసుకునేది అతడేనన్నారు. భూములు కొన్న వారితో అగ్రిమెంట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విదేశాల్లో ఉన్న పిల్లలు కరోనా నేపథ్యంలో సకాలంలో రాలేని పరిస్థితులలో గౌడనాయక్ పేరు మీద కొంత భూమి రిజిస్టర్ చేసి తర్వాత పిల్లల పేరు మీదకు మార్చుకోవడం జరిగిందన్నారు.

మూడు ఫాంహౌజ్‌లు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకం అని, పశువుల కొట్టాలు , కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌజ్ లుగా కనిపిస్తే అది రఘునందన్ రావు అజ్ఞానానికి నిదర్శనం అని మండిపడ్డారు. పెద్దమందడి మండలం మోజెర్లలో 50 ఎకరాల భూమి అని ఆరోపించారని, కానీ అది వెల్టూరు గ్రామ పరిధి అని, అక్కడ లండన్ లో డాక్టర్ గా పనిచేస్తున్న నా సొంత మరదలు కవిత , వారి స్నేహితులకు ఉన్న భూమి 11.20 ఎకరాలు మాత్రమేనన్నారు. అక్కడ ఫాంహౌజ్ లేదు .. కూరగాయల తోటలు ఉన్నాయి .. దానికి ప్రభుత్వం నుండి ఆ భూమికి ఏ రహదారి మంజూరు కాలేదు .. వారు ఇక్కడ ఉండరు కాబట్టి అప్పుడప్పుడు పర్యవేక్షణకు మాత్రమే వెళ్తుంటానన్నారు.

రఘునందన్ రావును ఎవరు ఆడుతున్నారో తెలుసు అని, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు వేరు వేరు కాదు .. రెండు ఒక తాను ముక్కలే .. వారి ఎజెండా, కార్యాచరణ ఒక్కటే అని ప్రజలకు తెలుసు అన్నారు. చాలా ప్రయత్నాలు చేసి నా నియోజకవర్గంలో కొందరిని లోబర్చుకుని వ్యతిరేక కార్యకలాపాలు మొదలుపెట్టారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక బురదజల్లే కార్యక్రమం మొదలు పెట్టారు .. గత ఎన్నికలలోనూ ఇటువంటి ప్రచారమే చేశారు .. ఇప్పుడు అదే మొదలు పెట్టారన్నారు. 40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు పాల్పడిన లేదన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిరంజన్ రెడ్డి భయపడరు .. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి ప్రజల్లో అభాసుపాలు చేయాలనుకోవడం అవివేకం అన్నారు. రఘునందన్ రావు తనను తాను ఎక్కువ ఊహించుకుని ఆరోపణలు చేస్తే ఇక్కడ భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని హెచ్చరించారు.

Next Story