బర్లు, గొర్రెలతో పాటు పాల ఉత్పత్తిలోనూ బీఆర్ఎస్ దోపిడీ.. హరీష్ రావుపై మంత్రి తీవ్ర ఆరోపణలు

by Ramesh N |   ( Updated:2024-09-14 11:37:19.0  )
బర్లు, గొర్రెలతో పాటు పాల ఉత్పత్తిలోనూ బీఆర్ఎస్ దోపిడీ.. హరీష్ రావుపై మంత్రి తీవ్ర ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శ్రీజ పాల ఉత్పత్తి కేంద్రం హరీష్‌రావు బినామీ అని, ఆ పేరుతో ఆయన చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల మదర్ డైరీ ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో గుడిపాటి మధుసూదన్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో గెలిచిన ఆరుగురు డైరెక్టర్‌లకు ఎన్నికల అధికారితో కలిసి మంత్రి సర్టిఫికెట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బర్లు, గొర్లలోనే కాకుండా పాల ఉత్పత్తిలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ దోపిడీ చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం మదర్ డైరీ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, సర్కార్ స్కూళ్లు, హాస్టళ్లు, హాస్పిటళ్లకు మదర్ డైరీ పాలు సరఫరా చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మదర్ డైరీ నుంచే లడ్డూల తయారీకి అవసరమయ్యే నెయ్యిని అందజేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట, వేములవాడ దేవస్థానాలకు లడ్డూల తయారీకి మదర్ డైరీ నుంచి నెయ్యి తరలింపును వెంటనే ప్రారంభించాలని మంత్రి కొండా సూరేఖను కోరారు. ఇలా చేయడం ద్వారా రూ. 60 కోట్ల అప్పులో ఉన్న మదర్ డైరీ అప్పును త్వరగా తీర్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన పాత జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed