ప్రధాని మోడీపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం

by Disha Web Desk 2 |
ప్రధాని మోడీపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే ఆగమేఘాల మీద ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా జలాల వాటా విషయంలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నదని, తాత్సారం చేస్తూ ఇప్పటికీ తేల్చలేదని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలోనూ నిర్లక్ష్యంగానే ఉన్నదన్నారు. తొలుత కృష్ణా జలాల వాటా తేల్చాలని, ఆ తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లు అడగాలని మంత్రి జూపల్లి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే పదేపదే ఆరోపిస్తున్న ప్రధాని ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను మంత్రి జూపల్లి తప్పుపట్టారు. గాడిదను, గుర్రాన్ని ఒకే గాటన కట్టే తీరులో ప్రధాని చేసిన కామెంట్లు సహేతుకం కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి బంధుప్రీతి, అవినీతి ఉన్నది నిజమేనని, కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీకి కూడా అన్వయించడం సరికాదన్నారు. పదవి కోసం పాకులాడకుండా ప్రధాని అయ్యే అవకాశమున్నా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు వాటికి ఆశపడలేదని, త్యాంగం చేశారని అన్నారు. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణాలు అర్పించారన్నారు. కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్తారని అన్నారు.

సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలచే ఎంతో మందిని అరెస్ట్ చేయించిన బీజేపీ... బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, దోపిడీపై ఎందుకు విచారణకు ఆదేశించ లేదో సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎందుకు విచారణ చేయడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతి జరిగిందని తెలిసినా ఇప్పటివరకూ ఎందుకు దర్యాప్తు చేయించలేదో సమాధానం చెప్పాలన్నారు. కక్షసాధింపులో భాగంగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కేటాయింపులో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు ఒకటో రెండో సీట్లు వచ్చుడు కూడా కష్టమేనన్నారు.


Next Story

Most Viewed