ఈహెచ్ఎస్​పై పది రోజుల్లో నివేదిక ఇవ్వండి.. మంత్రి హరీశ్ రావు

by Dishafeatures2 |
ఈహెచ్ఎస్​పై పది రోజుల్లో నివేదిక ఇవ్వండి.. మంత్రి హరీశ్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్యాష్ లెస్ వైద్య సేవలపైన (ఈహెచ్ఎస్) ఆయా సంఘాల ప్రతినిధులతో సమగ్రంగా చర్చించి, పది రోజుల్లో నివేదిక రూపొందించాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకువస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్​లో జరిగిన సమీక్షలో సర్కార్ ​తీసుకుంటున్న చర్యలు వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్ఛికి సూచించారు. అంతేగాక ఆరోగ్య శ్రీ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయాలన్నారు. పేషెంట్లకు అందుతున్న సేవల పట్ల స్వయంగా వెళ్లి తెలుసుకోవాలన్నారు. వారానికి మూడు ఆసుపత్రులు సందర్శించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పేషెంట్లకు అందుతున్న ఆరోగ్య శ్రీ సేవలను తెలుసుకోవాలన్నారు.

మెడికల్ కాలేజీల అనుమతుల పట్ల మంత్రి అభినందనలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కల సాకారం దిశగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు వైపు వేగంగా అడుగులు వేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ ఏడాది ప్రారంభించుకునే 9 మెడికల్ కాలేజీలకు గాను 6 మెడికల్ కాలేజీలకు అనుమతులు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మిగతా 3 మెడికల్ కాలేజీల అనుమతులు తుది దశలో ఉన్నట్లు డీఎంఇ రమేష్ రెడ్డి మంత్రికి వివరించారు. ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూఎన్​ఎంసీకి సహకరించాలని మంత్రి సూచించారు.

Next Story