దేవాదుల కాల్వల నిర్మాణం జూన్ కల్లా పూర్తి కావాలి : మంత్రి ఎర్రబెల్లి

by Vinod kumar |
దేవాదుల కాల్వల నిర్మాణం జూన్ కల్లా పూర్తి కావాలి : మంత్రి ఎర్రబెల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేవాదుల కాలువల నిర్మాణ పనులను వెంట వెంటనే పూర్తిచేసి జూన్ కల్లా ఆ కాలువల్లో నీళ్లు పారేలా సంసిద్ధం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. హైదరాబాదులోని మంత్రుల నివాసంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలువల పనులలోని సమస్యలను తెలుసుకుని వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం కానీ సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తేవాలని చెప్పారు. అలాగే భూ పరిహారం రైతులకు ఇప్పించడంలో ఆలస్యాన్ని క్షమించేది లేదని అలాంటి పెండింగ్ పనులు ఏమైనా ప్రభుత్వం వద్ద ఉంటే తమ దృష్టికి తెచ్చి వెంటనే ఆ నిధులను రైతులకు ఇప్పించాలని మంత్రి సూచించారు.

నష్కల్ రిజర్వాయర్ నుండి పాలకుర్తి రిజర్వాయర్ వరకు నిర్మిస్తున్న మెయిన్ కెనాల్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇదే కెనాల్ లో 8 ఎకరాల మేర రైతులకు భూపరిహారానికి సంబంధించి టోకెన్ ఇచ్చి ఉన్నారని అందుకు సంబంధించిన డబ్బులను వెంటనే రైతులకు ఇప్పించాలని అధికారులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ వివరాలు తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి డబ్బులు రైతులకు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు.

7 ఎల్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కు సంబంధించి జీ తమ్మడపల్లి నుంచి గంట్లకుంట వరకు నిర్మించాల్సిన కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తెలియజేశారు. రాయపర్తి మండలం కొలన్ పల్లి, తిరుమలాయపల్లి తదితర గ్రామాల గుండా గంట్లకుంట వరకు వచ్చే కాలువల పనులను కూడా వెంటనే పూర్తిచేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో వరంగల్ చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు, ఎస్ ఈ సుధీర్, ఈ ఈ లు సీతారాం, ప్రవీణ్ , డీఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story