తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మంత్రి బండి సంజయ్ సమీక్ష…ఎనిమీ ప్రాపర్టీస్ అంటే…?

by Kalyani |
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మంత్రి బండి సంజయ్ సమీక్ష…ఎనిమీ ప్రాపర్టీస్ అంటే…?
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ) సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీ)కు సంబంధించి మార్చి నెలాఖరులోపు రికార్డుల పరిశీలన, గ్రౌండ్ సర్వే పూర్తి చేసి లెక్క తేల్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బేగంపేట హోటల్ టూరిజం ప్లాజాలో రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎనిమీ ప్రాపర్టీస్ పై సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి కాగా గత నవంబర్ లో నిర్వహించిన సమీక్ష పురోగతి వివరాలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కొత్వాల్ గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న వందలాది ఎకరాల ఎనిమి ప్రాపర్టీస్ పై పురోగతి ఏమిటని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని ప్రశ్నించడంతో ఆయన సర్వే నెంబర్ల వారీగా పురోగతిని వివరించారు. కొన్ని స్థలాలు అన్యాక్రాంత మయ్యాయని, మరికొన్ని చోట్ల రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి పొజిషన్ లో ఉన్న రైతులకు అన్యాయం జరగకుండా, అదే సమయంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి నెలాఖరులోపూ సర్వే, రికార్డుల పరిశీలన పూర్తి చేసి నివేదిక అందించాలని కోరారు.

హైదరాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోని ఎనిమీ ప్రాపర్టీస్ పై జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదించండి...

హైదరాబాద్ ని బాకారంలోని 25 వేల 503 గజాల వివాదాస్పద స్థలంలో ఎనిమి ప్రాపర్టీస్ వాటా 5,578 గజాలు ఉందని, ఈ స్థలంలో 20 కుటుంబాలు పొజిషన్ లో ఉంటూ నివాసాలు, వ్యాపార సముదాయాలు నిర్మించుకున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అలాగే బహదూర్ పురాలోని రికాబ్ గంజ్ లో 710-724, 778 -784 నెంబర్లలో 3300 గజాల ఎనిమీ ప్రాపర్టీ వివాదంలో ఉందని వివరించారు . డీఎస్ డియోదీ గాలిబ్ పేరిట స్థలం ఉందని, ఈ స్థలం సర్వే నెంబర్, లొకేషన్ కూడా ట్రేస్ కావడం లేదన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ… కేంద్ర సెపీ అధికారులతోపాటు రాష్ట్ర రెవెన్యూ అధికారులు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం కొత్తగూడెంలోని పాల్వంచలోని 126/111, 126/112 సర్వే నెంబర్ లోని 40 ఎకరాల వ్యవసాయ ఎనిమీ ప్రాపర్టీని కొందరు రైతులు ఆక్రమించుకున్నారని తెలిపారు. దీనిపై కేంద్ర విభాగమైన కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ) అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసి సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు.

సెక్షన్ 8 ఏ ప్రకారం ఎనిమీ ఆస్తుల వివాదాలను పరిష్కరించండి....

వికారాబాద్ జిల్లాలోని అల్లంపల్లిలోని 426, 427, 428 సర్వే నెంబర్లలోని 17.22 ఎకరాల ఎనిమీ ప్రాపర్టీస్ లోని వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. శుభప్రద పటేల్ నూలి కుటుంబ సభ్యులు ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. ఇందులో 2.18 ఎకరాలు రైల్వే లైన్ కోసం రైల్వే శాఖ తీసుకుందన్నారు. ఈ స్థల వివాదం కోసం రూల్స్ ఏం చెబుతున్నాయని బండి సంజయ్ సెపీ అధికారులను అడిగారు. సెక్షన్ 8 ఏ ప్రకారం ఎనిమీ ప్రాపర్టీ అని తెలియకుండా కొన్న వాళ్లు, వలస యజమానుల కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్న స్థలాల తోపాటు, సెపీ, రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల క్రితం లీజుకిచ్చిన భూములకు సంబంధించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సెపీ అధికారులు తెలిపారు. తక్షణమే సెక్షన్ 8 ఏ ప్రకారం సమస్యను పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించారు.

త్వరలోనే హైదరాబాద్ లో సెపీ అనుబంధ కార్యాలయం ఏర్పాటు…

తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో సెపీ అనుబంధ కార్యాలయాలను ఏర్పాటు చేసేలా చూస్తామని మంత్రి బండి సంజయ్ తెలిపారు . ప్రస్తుతం ముంబై ఆఫీస్ నుంచి ఆయా రాష్ట్రాల ఎనిమీ ఆస్తులపై పర్యవేక్షిస్తున్నారని , ఇకపై ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే అనుబంధ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ లో సెపీ కార్యాలయ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఎనిమీ ప్రాపర్టీస్ అంటే ....?

1962లో చైనీస్ దండయాత్ర, 1965 నుండి 1971 వరకు నిర్వహించిన ఇండో-పాక్ యుద్ధం అనంతరం భారత్ నుంచి వెళ్లిపోయి పాకిస్తాన్, చైనాలో స్థిరపడి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వ్యక్తులకు సంబంధించి భారత్ లో ఉన్న ఆస్తులను శత్రు(ఎనిమీ ప్రాపర్టీ) ఆస్తులుగా ప్రభుత్వం గుర్తించింది. వీటి సంరక్షణ బాధ్యతలను కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ)కు అప్పగించింది. తెలంగాణ, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో దాదాపు 13 వేల వరకు శత్రు ఆస్తులు ఉన్నట్లు కేంద్రం వద్ద రికార్డులున్నాయి. వీటి మార్కెట్ విలువ వేల కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎనిమీ ప్రాపర్టీ చట్టంలోని సెక్షన్ 8(ఏ) ప్రకారం ఈ ఆస్తులను విక్రయించే అధికారం కేంద్రానికి ఉంది. అయితే నాటి నుండి నేటి వరకు ఈ ఆస్తులు చాలా చోట్ల అన్యాక్రాంత మయ్యాయి.

మరికొన్ని ఆస్తులకు సంబంధించి న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. ఆ ఆస్తుల వివాదాల పరిష్కారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సెపీ ముంబై విభాగ అధికారులతో పాటు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, హైదరాబాద్ అదనపు కలెక్టర్ డాక్టర్ జి ముకుంద రెడ్డి, డిఆర్ఓ ఈ వెంకటాచారి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం, తహసిల్దార్లు, వికారాబాద్ రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed