బీజేపీలో టీజేఎస్ విలీనం.. క్లారిటీ ఇచ్చిన ప్రొ.కోదండరాం

by Disha Web Desk |
బీజేపీలో టీజేఎస్ విలీనం.. క్లారిటీ ఇచ్చిన ప్రొ.కోదండరాం
X

దిశ,డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రోజు ట్విస్ట్ తీసుకుంటున్నాయి. నిన్నా మొన్నటి వరకు ఈడీ, ఐటీ దాడులతో అట్టుడికిన తెలంగాణ పాలిటిక్స్ లో తాజాగా సిట్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేవలం నలుగురు అధికార పార్టీ నేతలకే పరిమితం కాలేదని వారితో పాటు మరి కొంత మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయనే విషయాన్ని సిట్ హైకోర్టుకు వివరించింది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను సిట్ అధికారులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అయితే సిట్ దాఖలు చేసిన ఆధారలలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో టీజేఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నంలో కోదండరాం ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కోదండరాం సొంతంగా పార్టీ స్థాపించాక చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. వరుసగా అన్ని ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవమే తప్ప అనుకూల సంకేతాలు ఎక్కడ కనిపించలేదు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి టీజేఎస్ లో బీజేపీలో లేదా కాంగ్రెస్ లో విలీనం చేస్తారనే ప్రచారం ఆయా సందర్భాల్లో వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా స్కై హై హోటల్ లో సింహయాజిని కలిసిన కోదండరాం ఆయనతో చర్చలు జరిపారని సిట్ చేసిన ఆరోపణలపై రాజకీయంగా దుమారం రేపుతోంది.

అయితే ఈ భేటీపై నిన్ననే క్లారిటీ ఇచ్చిన కోదండరాం తాజాగా శుక్రవారం పార్టీ భవిష్యత్ పై స్పష్టత ఇచ్చారు. సిట్ ఆరోపించినట్టుగా తాను సింహయాజిని కలిసిన మాట వాస్తవమేనని కానీ తాను ఆధ్యాత్మిక వేత్తగానే ఆయనను చూశాను. ఆ దిశగానే ఆయనతో చర్చలు జరిపానని చెప్పారు. అంతే తప్ప మా మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించిన కోదండరాం.. తాను బీజేపీలో చేరాలనే ప్రతిపాదనలు గతంలో ఆ పార్టీ నేతల నుంచి వచ్చాయన్నారు. కానీ తాను పార్టీ మారడం జరగదని చెప్పాన్నారు. తమకంటూ ఓ పార్టీ ఉందని అది తన ఒక్కడి నిర్ణయం మేరకు జరగదని వారితో చెప్పాన్నారు. భవిష్యత్ లోనూ తెలంగాణ జన సమితి స్వతంత్రంగా పని చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.

గతంలో పోడు భూములు, ఆర్టీసీ సమస్యలు, ఇంటర్ ఫలితాల సమస్యలపై ఇతరులతో కలిసి పని చేశామన్న కోదండరాం.. రాజకీయాలు, వ్యాపారాలు కలిసిపోయాయని ఈ రెండింటితో పాటు ఆయా మత పెద్దలతో సంబంధాలు పెరిగిపోవడం వల్ల ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు కారణం అవుతున్నాయన్నారు. రాజకీయం వ్యాపారంలో పెట్టుబడిలో భాగం కావడంతో సమస్యలు మరింత ఉత్పన్నం అవుతున్నాయని గతంలో చిన్న చిన్న వ్యాపారలు చేసే వాళ్లు ప్రస్తుతం నాయకులకు బినామిలుగా మారిపోయి కోట్లకు పడగలు ఎత్తుతున్నారని అన్నారు. ఈ విషయంలో ప్రజా సంఘాలు, పార్టీలు అందరం కలిసి ఎదుర్కోవాలన్నారు.



Next Story

Most Viewed