లెక్కలతో కుస్తీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పై ఎవరి ధీమా వారిదే..

by Disha Web Desk 23 |
లెక్కలతో కుస్తీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు పై ఎవరి ధీమా వారిదే..
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తుంది. ఈ ఎన్నికల్లో గెలుపోటములపై ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మేడ్చల్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ వివరాలు తెలుసుకోవడం తో పాటు తమకు ఎంత మేర ఓట్లు పడ్డాయనే దానిపై అనుచరుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు.బూత్ ల వారీగా తమకు పోలైన ఓట్ల లెక్కలతో అభ్యర్థులంతా కుస్తీలు పడుతున్నారు.

బరిలో హేమ హేమీలు..

మేడ్చల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్ పల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ ల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హేమ హేమీలు తలపడుతున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండో సారి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి తోటకూర జంగయ్య యాదవ్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తొలిసారి అసెంబ్లీ బరిలో పోటీ పడుతున్నారు. మల్కాజిగిరి లో సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ నుంచి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

కూకట్ పల్లి లో మూడోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బరిలో నిలువగా, కాంగ్రెస్ నేత బండి రమేష్, జనసేన అభ్యర్థి ముమ్మాడి ప్రేమ్ కుమార్ లు తోలిసారిగా తలపడుతున్నారు. కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ నుంచి మూడో సారి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ నుంచి కోలాన్ హన్మంత్ రెడ్డిలు గత ఎన్నికల్లో పలుమార్లు ఓటమి పాలై.. ఈసారి ఏలాగైనా గెలువాలని ఊవ్విళ్లురారుతున్నారు.ఉప్పల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని కాదని, బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ పార్టీ మందుముల పరమేశ్వర్ రెడ్డికి, బీజీప మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ కు ఇచ్చింది. అయితే ఈ ఐదు నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది

ఎవరికి వారే గెలుపుపై ధీమా..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్లు మెజారిటీ సంస్థలు తమ సర్వే నివేదికలను వెల్లడించాయి.అయితే మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమది గెలుపంటే తమదేనన్న ధీమాను వ్యక్తంచేస్తున్నాయి. పోలింగ్ సరళిని బట్టి విజయం తమదంటే.. తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపు పై లెక్కలు వేసుకుంటున్నాయి. పోలింగ్ బూత్ ల వారీగా ఎక్కడెక్కడ తమకు ఎన్ని ఓట్లు లభించాయో విశ్లేషిస్తున్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో తమ పార్టీకి మద్దతు లభించిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లలో తమకు ఎన్ని ఓట్లు వస్తాయో అంచనా వేస్తున్నారు. పార్టీ గెలుపు కోసం ఎవరెవరు పని చేశారు..? ఎవరు వ్యతిరేకంగా పనిచేశారనే వివరాలను తెలుసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో క్లీన్ స్విప్ చేస్తుందని, ఆరు గ్యారంటీలు తమను గట్టేక్కిస్తాయని, సర్వే నివేదికల్లోనూ అదే విషయం వెల్లడైందని భావిస్తుండగా, అధికార పార్టీ నేతలు మాత్రం సంక్షేమ పథకాలు మరోసారి గెలిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు జనసేన, బీజేపీ అభ్యర్థులు మాత్రం తమకు అగ్రనేతల పర్యటనలు కలిసివస్తాయని పేర్కొంటున్నారు.

ఆ రెండింటి పై ఉత్కంఠ..

జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ల తీర్పుపై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండు నియోజకవర్గాలో మంత్రి మల్లారెడ్డి తో పాటు అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులు తలపడుతున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నుంచి మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర జంగయ్య తలపడుతున్నారు.అభ్యర్థుల ప్రకటనకు ముందు మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ లో తనకు పోటియే లేదని, ప్రత్యర్థి పార్టీల నుంచి ధీటైన అభ్యర్థులు లేకపోవడంతో దంగల్ మజా రావడంలేదని ప్రకటించి నియోజకవర్గంలో ఎన్నికల వేడిని రాజేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్ రెడ్డి,జెడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి తో సహా, నక్కా ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీ నడిచింది.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడి విషయంలో మంత్రి హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపడం.. కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి పోటీ చేయడంతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డిలు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మైనంపల్లి గుండా గిరి ఇక చెల్లదంటూ మంత్రులు ప్రచారం చేయడంతో పాటు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎన్నికల ఇన్ చార్జీగా వ్యవహరిస్తూ.. మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. అయితే మైనంపల్లి మంత్రుల ఆరోపణలను తనదైన శైలిలో తిప్పికొడుతూ చాప కింద నీరులా తన ప్రచారాన్ని కొనసాగిస్తూ..అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మైనంపల్లి విజయం సాధించి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అవుతారని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటుండగా, మర్రి రాజశేఖర్ రెడ్డియే తప్పకుండా విజయం సాధిస్తారని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.Next Story