- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానుకలిస్తేనే ఎన్ఓసీ ఇస్తారా?:TRA అధ్యక్షుడు
వేల కోట్ల రూపాయల విలువైన, ఎటువంటి వివాదాలు లేని ప్రైవేటు ఇళ్లు, ప్లాట్లను అక్రమంగా నిషేధిత(22A) జాబితాలో చేర్చి అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: వేల కోట్ల రూపాయల విలువైన, ఎటువంటి వివాదాలు లేని ప్రైవేటు ఇళ్లు, ప్లాట్లను అక్రమంగా నిషేధిత(22A) జాబితాలో చేర్చి అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కానుకలు సమర్పించుకుంటేనే 'నిరభ్యంతర పత్రాలు' ఇస్తామంటూ రెవెన్యూ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏసీ గదుల్లో కూర్చొని తమాషా చూస్తున్నారు..
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లుగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ల వ్యవహారశైలి ఉందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. అధికారులు ఏసీ గదుల్లో కూర్చొని తమాషా చూస్తున్నారని, సమస్యలను సత్వరమే పరిష్కరించడం లేదని ధ్వజమెత్తారు. అధికారులు ఏకపక్షంగా ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలోకి చేర్చి, రిజిస్ట్రేషన్లు నిలిపివేసి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పి, ప్రైవేటు ఆస్తులను ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
దోచుకునేందుకే 22A లోకి..
అవినీతిని ప్రశ్నించే నాథుడే కరువయ్యాడని ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ అధికారిని ఏసీబీ పట్టుకున్నా వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయన్నారు. సర్వేయర్లు, వీఆర్వోలు, ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, కలెక్టర్లు, కొందరు రాజకీయ నాయకులు.. ప్రజలను దోచుకునేందుకే ఉద్దేశపూర్వకంగా కొత్తగా ప్రైవేటు ఆస్తులను 22A జాబితాలో చేర్చారని ఆరోపించారు. తీరా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే కానీ తమ ఆస్తి నిషేధిత జాబితాలో ఉన్న విషయం ప్రజలకు తెలియడం లేదని, ఎన్ఓసీలు తీసుకురావాలని అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. లంచాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఎలా ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారన్నారు.
జాబితాలో చేర్చిన సర్వే నంబర్లు ఇవే..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఏదో ఒక సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు. ప్రధానంగా.. పోచారం సర్వే నంబర్లు 50, 36, కాచివాని సింగారం సర్వే నంబర్ 43, చెంగిచెర్ల సర్వే నంబర్ 33/2, పర్వతాపూర్ సర్వే నంబర్లు 16, 17, 26, 27, 28 తదితర ప్రాంతాల్లోని ఆస్తులను కొత్తగా ఈ జాబితాలో చేర్చినట్లు వెల్లడించారు. వెంటనే ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రులు జోక్యం చేసుకొని ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, ప్రైవేటు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతులు మంజూరు చేసేలా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులను ఆదేశించాలని ప్రవీణ్ కుమార్ కోరారు.






