అనుమతి లేని పాఠశాలలపై చర్యలేవి..? విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలల నిర్వహణ

by Shiva Kumar |
అనుమతి లేని పాఠశాలలపై చర్యలేవి..? విచ్చలవిడిగా ప్రైవేటు పాఠశాలల నిర్వహణ
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో విద్యా శాఖ అనుమతి లేకుండా వందల సంఖ్యలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. వాటి యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్న అధికారులు ఏదైనా విషాద ఘటన వెలుగు చూస్తే తప్ప అనుమతుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎవరైనా ఆందోళనలు చేస్తే తప్ప విద్యాశాఖ స్పందించని పరిస్థితి నెలకొంది. ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నాలు, ఆందోళనలతో కొన్నింటిని మూసివేయగా ఇంకా అనుమతి లేని, గడువు ముగిసిన పాఠశాలలు వందల సంఖ్యలో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు.

సర్కారు ఆదాయానికి గండి..

అనుమతులు తీసుకోని కారణంగా సర్కారు ఆదాయానికి రూ.కోట్లలో గండిపపడడంతో పాటు విద్యార్థులకు సైతం నష్టం వాటిల్లుతోంది. ఆయా పాఠశాలలు ఇచ్చే టీసీలు చెల్లవు. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతికి వస్తే పరీక్ష ఫీజు చెల్లించడమూ సాధ్యం కాదు. జిల్లాలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలల అనుమతి గడువు ముగిసినా.. తిరిగి రెన్యువల్ చేసుకోవడం లేదు. శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ స్కూళ్లు ఒకచోట అనుమతి తీసుకొని మరో చోట బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగుల్లో తాత్కాలిక కార్యాలయాలు తెరిచి పేరెంట్స్ వద్ద రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లు ఒకటి నుంచి ఏడో తరగతి వరకే అనుమతులు తీసుకుని 8, 9, 10వ తరగతి గదులతో నడిపిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సాధారణ స్కూల్ అని అనుమతులు తీసుకుని ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్ అని రకరకాల ట్యాగులు తగిలిచ్చి పేరేంట్స్ వద్ద దోపిడీకి పాల్పడుతున్నాయి.

ఉదాహరణకు కొన్ని..

  • కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర వద్ద గల వశిష్ట భవన్‌లో అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య స్కూల్ నడుపుతుండగా ‘దిశ’ వరుస కథనాలతో విద్యా శాఖ ఆ స్కూల్ ను మూసివేసింది. అయితే అప్పటికే స్కూల్ యాజమాన్యం వందల సంఖ్యల్లో పేరెంట్స్ నుంచి స్కూల్ అడ్మిషన్లు, ఫీజుల పేరిట రూ.కోట్లలో వసూలు చేసింది.
  • కృష్ణానగర్ ఎన్ఎస్పీ కాలనీలో శ్రీ చైతన్య స్కూల్ కొత్త బ్రాంచీ తెరిచింది. అయితే బిల్డింగ్ నిర్మాణంలో ఉండగానే వాచ్‌మెన్ రూమ్‌లో 2024-25వ సంవత్సరానికి ఆడ్మిషన్లు తీసుకుంది. అయితే ‘దిశ’లో చ్చిన కథనంతో మున్సిపల్ అధికారులు వాచ్‌మెన్ గదిని కూల్చి వేశారు. దీంతో చైతన్య స్కూల్ తాత్కాలికంగా అడ్మిషన్లు నిలిపివేసింది.
  • తాజాగా ఉప్పల్ మండలం హనుమసాయి నగర్‌లోని అనుమతి లేకుండా నడుస్తున్న మాస్టర్ మైండ్స్ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఏఐవైఎఫ్ నాయకులు కొద్ది రోజులుగా ఆందోళన చేయగా ఎట్టకేలకు స్పందించిన విద్యాశాఖ 11వ తేదీన స్కూల్ ను సీజ్ చేసింది. ప్రజా సంఘాలు, స్టూడెంట్ యూనియన్ల ఆందోళనలు, పత్రికల్లో వస్తున్న కథనాలతో విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవడం తప్ప స్వతహాగా తనిఖీలు నిర్వహించి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కావాల్సిన అనుమతులు..

కొత్తగా ఒక పాఠశాలను ప్రారంభించాలంటే తనిఖీ ఫీజు, డిపాజిట్ తదితరాలకు బడి ప్రాంగణం విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వివిధ ప్రభుత్వ శాఖలకు ఫీజు చెల్లించాలి. అగ్ని మాపక శాఖ ఎన్ఓసి, ట్రాఫిక్ పోలీసుల క్లియరెన్స్, శానిటరీ సర్టిఫికెట్, పాఠశాల భవనం పటిష్టత ధ్రువ పత్రాలు పొందాలి. ఒకసారి అనుమతి పొందితే.. పదేళ్ల వరకూ గడువు ఉంటుంది. గుర్తింపు లేని బడులకు విద్యా హక్కు చట్టం ప్రకారం రూ.లక్ష జరిమానా విధించవచ్చు. మేడ్చల్ జిల్లాలో జరినామా విధించిన దాఖాల్లేవ్.. ఇప్పటికైనా మేడ్చల్ జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. అనుమతులు లేని పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారిని వివరణ కోరేందుకు ‘దిశ’ తన కార్యాలయంలో ప్రయత్నించగా, ఆమె అందుబాటులో లేరు. ఫోన్ చేస్తే కలవడం లేదు. అనుమతి తీసుకున్నది కేవలం ‘వ్యాక్సన్ స్కూల్’ మాత్రేమే.. కాని ఇంటర్నేషనల్ స్కూల్ అని బోర్డు రాసి ఉంది.Next Story

Most Viewed