మాజీ ఎంపీపీ వైయస్సార్‌పై ట్రెస్‌పాస్ కేసు నమోదు..ఏం జరిగిందంటే..?

by Aamani |
మాజీ ఎంపీపీ వైయస్సార్‌పై ట్రెస్‌పాస్ కేసు నమోదు..ఏం జరిగిందంటే..?
X

దిశ, ఘట్కేసర్ : రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్లో ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి (వైయస్సార్) ,మరో 12 మందిపై ట్రెస్ పాస్ కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే... పోచారం మున్సిపాలిటీ కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలా వెంచర్లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న భూవివాదాల విషయం తెలిసిందే. ఈనెల 21న ఏకశిలా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మద్దతు తెలపడానికి వచ్చి వెంచర్లో పనిచేస్తున్న యువకులపై దాడికి పాల్పడినందుకు ఎంపీ ఈటల రాజేందర్, వైయస్సార్ తో పాటు మరి కొంతమందిపై పోచారం పీఎస్ లో కేసు నమోదు అయింది.

ఏకశిలా భూ వివాదం తేలే వరకు ఇక్కడికి ఎవరిని రానీయకుండా ఉండాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ఎంపీ ఈటల రాజేందర్ కోరగా ఆ ప్రాంతంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే గురువారం మాజీ ఎంపీపీ వైయస్సార్, ఘట్కేసర్ మండల బిజెపి నాయకులు బసవరాజు గౌడ్, సురేష్ నాయక్, ఏకశిలా ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జుబేర్ అక్రమ్, ఉమేర్ అక్రమ్, అమీర్ సోహెల్ , చెరుకు శివారెడ్డి, సమ్మిరెడ్డి, వేమూరి శ్రీనివాస్, మన్యం, బాలు, ఐలయ్య, నీలి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి అక్రమంగా సర్వేనెంబర్ 739, 740, 741, 742 లో వ్యవసాయ భూమిలో ప్రవేశించి జేసీబీ యంత్రాలతో చెడగొట్టారని భూమి యజమాని ఆలూరి వెంకటేష్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ యాక్ట్ 329(3), 324(4), r/w 3(5) సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story