డాక్యుమెంట్ రావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే ..

by Aamani |
డాక్యుమెంట్ రావాలంటే అడిగినంత ఇచ్చుకోవాల్సిందే ..
X

దిశ,కుత్బుల్లాపూర్ : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైరవీ కారులదే పై చేయి గా నిలుస్తుంది.మామూళ్లు అందిస్తే ఒకలా లేకుంటే మరోలా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సామాన్యులకు చుక్కలు చూపెడుతుంది.మేడ్చల్ జిల్లా లో అత్యధిక రిజిస్ట్రేషన్ లు అవుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు వరుసలో ఉంది. ప్రభుత్వానికి ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండి అధిక ఆదాయం సమకూరుతున్నప్పటికి అంతే స్థాయిలో అవినీతి ఆరోపణలను ఇక్కడ పని చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ లు ఎదుర్కొంటున్నారు.

గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ గా పని చేసిన మహిళా అధికారి ఒక్కో పనికి ఒక్కో రేట్ అంటూ ఫిక్స్ చేసి బిల్డర్ దగ్గర, భూ యజమానుల దగ్గర భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. సుమారు 3 సంవత్సరాలకు పైగానే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ గా చేసిన సదరు మహిళా అధికారి కొంత మంది డాక్యుమెంట్ రైటర్స్ ను తన ఏజెంట్స్ పెట్టుకుని పూర్తిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంను అవినీతికి కేరాఫ్ గా నిలిపినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఆ మహిళా అధికారి బదిలీ అనంతరం వచ్చిన ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ అదే బాటలో పయనిస్తూ ముడుపులు భారీ స్థాయిలో తీసుకుంటున్నట్టు సమాచారం.

పైరవీ కారులుగా డాక్యుమెంట్ రైటర్స్... ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్

కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో డాక్యుమెంట్ రైటర్స్ పైరవీ కారులుగా, సబ్ రిజిస్ట్రార్ కు ఏజెంట్స్ గా ఉంటూ రూ. లక్షలు ప్రతి రోజు చేతులు మారుస్తున్నారనే బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. భూ రిజిస్ట్రేషన్ లు, ప్లాట్స్ రిజిస్ట్రేషన్ ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తున్న ప్రజలు రిజిస్ట్రార్ సేవలకు కొంత పైకం చెల్లించిన తర్వాతే చట్ట ప్రకారం ప్రభుత్వ ఖజానాకు రుసుములు చెల్లిస్తున్నట్లు సమాచారం.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో 22ఏ కింద ఉన్న పలు సర్వే నంబర్స్ భూములు, ప్లాట్స్ ని సైతం ఇక్కడి కార్యాలయం లో అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సామాన్యులు వెళ్లితే మీ సర్వేనెంబర్ లోని భూమి నిషేధిత జాబితాలో ఉంది రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు అని చెప్పి పంపుతున్న కార్యాలయం సిబ్బంది,అదే పైరవీకారులు, డాక్యుమెంట్ రైటర్స్ ఏజెంట్స్ ద్వారా వెళ్లితే చట్టం లో ఉన్న లొసుగులతో పక్కాగా పని చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

లీగల్ గా అన్ని ఓకే అనుకున్న రిజిస్ట్రేషన్ లకు ఒకలా, డాకుమెంట్స్ సక్రమంగా లేకుండా లీగల్ కొర్రీలు ఉన్న వాటికీ ఒకలా చార్జీలు పిక్స్ చేసి మామూళ్లను దండుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.డాక్యుమెంట్ రైటర్స్ తో కుమ్మక్కయి వారితో తమ వసూళ్ల పర్వం కానిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.బిల్డర్స్ నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు అక్రమ రిజిస్ట్రేషన్ ల విషయం లో భారీగానే ముడుపులు తీసుకుంటున్నట్లు వినికిడి. అనుమతుల ప్రకారం కాకుండా అదనంగా నిర్మించిన ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్స్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ ఒక్కో ప్లాట్ కు రూ.లక్షకు పైగా మామూళ్ల రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం.

సామాన్య పౌరులకు దక్కని సబ్ రిజిస్ట్రార్ సేవలు..

కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ సేవలు సామాన్యులకు అందని ద్రాక్షగానే ఉన్నాయనే విమర్శలు చుట్టూ ముడుతున్నాయి. కాసుల వేటను రుచిమరిగిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్స్ సామాన్యులకు చుక్కలు చూపెడుతూ లీగల్ దారిలో వెళితే పనులు కావంటూ ముప్పు తిప్పలు పెడుతూ అడ్డ దారి కోసం అధిక మొత్తంలో మనీ డిమాండ్ చేస్తూ అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు.స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రార్ సేవలు అంతా సవ్యంగా జరుగుతుందిలే అని ఎలాంటి బ్రోకర్ లు లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తున్న ప్రజలను మీ దగ్గర పలానా డాక్యుమెంట్ సరిగ్గా లేదు, పలానా లింక్ మిస్ అయ్యింది అని తిప్పి పంపి సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది చుక్కలు చూపెడుతునట్లు వినికిడి. అదే డాక్యుమెంట్ రైటర్స్ పంపే బ్రోకర్స్, ఏజెంట్స్ తీసుకువచ్చే డాక్యుమెంట్స్ సులువుగా చిటికెలో పనులు చక్కదిద్ది పంపుతున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed