కూలీ రేట్లు పెంచే వరకు కార్మికుల బంద్ ఆగదు: భవన నిర్మాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

by Kodari Anjali |

కార్మికులకు కూలీ రేట్లు పెంచే వరకు కార్మికుల బంద్ ఆగదని తెలంగాణ భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు.

కూలీ రేట్లు పెంచే వరకు కార్మికుల బంద్  ఆగదు: భవన నిర్మాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
X

దిశ, దమ్మాయిగూడ : కార్మికులకు, తాపీ మేస్త్రీలకు కష్టానికి తగ్గ కూలీ రేట్లు పెంచే వరకు కార్మికుల బందు ఆగదని తెలంగాణ భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశరాజ్ మల్లేష్ వెల్లడించారు. మంగళవారం దమ్మాయిగూడ డివిజన్ కేంద్రంలో కార్మికుల ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతనలో కార్మికుల, తాపీ మేస్త్రీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశరాజ్ మల్లేష్ తో పాటు యూనియన్ కోశాధికారి వెంకటేశ్వర్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఆంజనేయులు, సుధాకర్ లతో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఇటీవల గత పది రోజులుగా సెంట్రింగ్ వారు బంధు నిర్వహించి కూలీ రేట్లు పెంచుకున్నారని గుర్తు చేశారు.

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని..

కానీ భవన నిర్మాణ కార్మికులకు, తాపీ మేస్త్రీలకు కూలి రేట్లు పెరగకపోవడంతో ఇబ్బందులు పడే అవకాశాలున్నాయన్నారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతేనే కార్మికుల పొట్ట నిండుతుందని గుర్తు చేశారు. ప్రతి ఒక్క కార్మికులు ట్రేడ్ యూనియన్ ద్వారా సభ్యత్వాలు తీసుకుంటే ప్రభుత్వంతో కొట్లాడి ఈఎస్ఐ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం తో పాటు 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు పింఛన్లు పొందడానికి అర్హత ఉంటుందన్నారు. ఇందుకోసం త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించి మన హక్కులను సాధించుకుందామని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులను, తాపీ మేస్త్రీలను సెంట్రింగ్ వారు అవమానపరచడం బాధాకరమన్నారు. వారికి తగ్గట్టుగానే తాము ఇబ్బందులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎవరైనా చాటు మార్గాన..

భవన నిర్మాణ రంగంలో దాదాపు 44 వృత్తుల వారు పనులు చేస్తేనే భవన నిర్మాణం జరుగుతుందని, ఏ ఒక్కరితో భవన నిర్మాణం కాదని ఇది తెలుసుకోవాలని సూచించారు. మంగళవారం నుండి అమావాస్య వరకు ఈ బంధు కొనసాగుతుందని తెలిపారు. ఆ లోపల కూలీల, తాపీ మేస్త్రీల కూలీ రేట్లు పెరుగుతాయని ఆశాభావం ఉందని, లేనియెడల బందు ఉదృతం చేస్తామన్నారు. బంద్ సందర్భంగా ఎవరైనా చాటు మార్గాన పనులు చేసినట్లయితే ట్రేడ్ యూనియన్ తరపున 20 వేల రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క కార్మికుడు ట్రేడ్ యూనియన్ లో సభ్యత నమోదు చేసుకుంటే ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. ఒంటరిగా పనులు చేస్తే గుర్తింపు ఉండదని, కూలీ రేటు పెరగదని, సౌకర్యాలు అందమని తెలిపారు. ఐక్యతతో ఉన్ననాడే కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

దమ్మాయిగూడ కార్మిక సంఘం అధ్యక్షునిగా సులేమాన్...

సమావేశ అనంతరం రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో దమ్మాయిగూడ డివిజన్ కార్మిక సంఘం ను ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సులేమాన్, ఉపాధ్యక్షులుగా కృష్ణయ్య, వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా సుబ్బయ్య, కోశాధికారిగా గురువయ్య లతోపాటు మరో పదిమందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

Next Story