గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

by Disha Web Desk 21 |
గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
X

దిశ ప్రతినిధి,మేడ్చల్: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. హరీశ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 16న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు గాను 131 పరీక్ష కేంద్రాలలో 53,964 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు, విద్య, వైద్యశాఖల అధికారులు ఆయా కేంద్రాల వద్ద అన్ని రకాల వసతులు కల్పించాలని కోరారు.

అన్ని పరీక్ష కేంద్రాల్లో మంచినీటి వసతితో పాటు కేంద్రాల్లో అవసరమైన ఫర్నీచర్, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకంగా బస్సులను నడపాలని పేర్కొన్నారు. పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాబోయే రోజుల్లో టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మరిన్ని నోటిఫికేషన్లు రావడంతో పాటు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దీని దృష్ట్యా ఇప్పటి నుంచే అన్ని రకాలుగా అధికార యంత్రాంగం సన్నద్దం కావాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, రాచకొండ ఏసీపీ రష్మీ పెరుమాళ్, జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, ఆయా మండలాల తహశీల్దార్లు, రవాణా, ఆర్టీసీ, విద్యుత్తు శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed