- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎల్‌సీ భూముల కేసు.. హైకోర్టులో కీలక మలుపు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని పేట్ బషీరాబాద్ గ్రామం సర్వే నెంబర్ 48 లో గల రూ.కోట్ల విలువైన ప్రభుత్వ అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూముల వ్యవహారం మలుపులు తిరుగుతోంది.

దిశ, పేట్ బషీరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని పేట్ బషీరాబాద్ గ్రామం సర్వే నెంబర్ 48 లో గల రూ.కోట్ల విలువైన ప్రభుత్వ అర్బన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూముల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో సరిహద్దులు తేల్చాల్సిన రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తుండటంతో, వివాదాస్పద భూమి చుట్టూ ఇప్పుడు చట్టపరమైన వ్యూహ, ప్రతివ్యూహాలు ముసురుకున్నాయి. ఒకవైపు నిగూ ఢంగా సాగిన ప్రభుత్వ భూముల విక్రయాలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం.. మరో వైపు పాత తీర్పును సవాల్ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులు వేసిన రివ్యూ పిటి షన‍్లు.. వెరసి త్వరలో హైకోర్టులో జరగబోయే న్యాయవిచారణ అం శం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సర్వేనెంబర్ 48/1 ప్రభుత్వానిదా ? 48/2 ప్రైవేట్ వ్యక్తులదా ?
అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధి కారి మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ 2023 మే 1న జారీ చేసిన ఫైనల్ ఆర్డర్ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల పూర్వీకురాలైన సరోజినీ బాయి దాఖలు చేసిన డిక్లరేషన్‌ను ఆమోదించారు. ఆ ఉత్తర్వుల ప్రకారం సర్వేనెంబర్ 48/2 లోని 7 ఎకరాల 32 గుంటల భూమిని "నాన్-సర్ప్లస్"గా నిర్ధారిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా క్లియరెన్స్ ఇచ్చారు.
సర్వే నెంబర్ల ‘మాయాజాలం’!
కానీ, ప్రైవేట్ వ్యక్తులకు అడిషనల్ కలెక్టర్ క్లియరెన్స్ ఇచ్చింది సర్వే నెంబర్ 48/2 కి మాత్రమేనని, కానీ ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుని, రక్షణ బోర్డు ఏర్పాటు చేసినా మిగులు భూమి సర్వే నెంబర్ 48/1లో ఉందని స్పష్టంగా అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు సర్వే నెంబర్లు క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రైవేట్ వ్యక్తులు తమ 48/2 భూమి సాకుతో.. ప్రభుత్వానికి చెందిన 48/1 (48/P) లోని 4856.20 చదరపు మీటర్ల (సుమారు 5807 గజాల) భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారా? అనే సరిహద్దుల వివాదమే ఈ మొత్తం రచ్చకు కేంద్ర బిందువుగా మారింది.
‘జాయింట్ సర్వే’ జరిగిందా?
ఈ సర్వే నెంబర్ల గందరగోళాన్ని గమనించిన హైకోర్టు తీర్పులో అత్యంత స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వివాదాస్పద స్థలం ఖచ్చితంగా ఎవరి పరిధిలోకి వస్తుందో తేల్చడానికి.. సర్వే నెంబర్ 48, 48/1, 48/2లపై సమగ్రమైన ‘సంయుక్త సర్వే’ నిర్వహించాలని కుత్బుల్లాపూర్ తహశీల్దార్‌ను ఆదేశించారు. ఒకవేళ ఆ సర్వేలో ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉన్న స్థలంలో ఏ భాగమైనా ప్రభుత్వ భూమి (48/1) అని తేలితే.. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవచ్చని అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
నెలలు గడిచినా..1
అయితే, కోర్టు ఆదేశాలు జారీ చేసి నెలలు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో కుత్బుల్లాపూర్ రెవెన్యూ యంత్రాంగం ఆ సంయుక్త సర్వేను పూర్తి చేసిందా? లేదా? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి రక్షణకు సంబంధించిన అంశం అయినప్పటికీ, సరిహద్దులు గుర్తించడంలో అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. అధికారుల ఈ అలసత్వమే ఆక్రమణదారులకు మరోసారి న్యా యపరమైన లూప్‌హోల్స్ వెతుక్కు నే అవకాశం కల్పించిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
‘పిల్’ భయంతోనే ‘రివ్యూ’ దరఖాస్తులు ..?
ఇక ప్రైవేట్ వ్యక్తులు వేసిన రివ్యూ పిటిషన్ల వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు స్పష్టమవుతోందని చెప్తున్నారు. 22 డిసెంబర్ 2025న కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వచ్చి 9 నెలలు దాటినా అధికారులు సర్వే చేయలేదని విమర్శలు ఉన్నాయి. కొంపల్లి నివాసి స్పందించి, ఈ యూఎల్‌సీ భూముల అక్రమ విక్రయాలపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. తీర్పు వచ్చిన పది నెలల దాకా గమ్మున ఉన్న వారు.. హడావుడిగా హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అని తెలుస్తుంది. త్వరలో హైకోర్టు ధర్మాసనం ముందు ఈ లేట్ రివ్యూ పిటిషన్ విచారణకు రానుంది. న్యాయస్థానం అనుమతిస్తే సరి. లేదంటే అది అక్కడితోనే కొట్టుకుపోతుంది. ఒకవైపు పేట్ బషీరాబాద్ పోలీస్టేషన్‌లో ప్రభుత్వ సైన్ బోర్డుల తొలగింపు ఆర్‌ఐ పై దాడి ప్రయత్నంపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు సాగుతుండగా.. మరోవైపు ఈ లీగల్ పోరాటం ఊపందుకోవడం విశేషం. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు కోర్టు ముందు గట్టిగా నిలబడతారా? లేక ప్రైవేట్ వ్యక్తుల కాలయాపన వ్యూహాలకు లొంగిపోతారా? అనేది తెలియాలంటే గురువారం హైకోర్టు వెలువరించే రోజువారీ ఉత్తర్వులు వచ్చే వరకు వేచి చూడాల్సిందే!






