కాంట్రాక్ట‌ర్ల‌తో ఎంఎంసి అధికారుల స‌మావేశం..

by Kodari Anjali |

మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, నిర్వహణ పనులకు సంబంధించిన అంశాలపై తార్నాకలోని ఎంఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు.

కాంట్రాక్ట‌ర్ల‌తో ఎంఎంసి అధికారుల స‌మావేశం..
X

దిశ, మేడ్చల్ బ్యూరో: మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో కొనసాగుతున్న అభివృద్ధి మరియు నిర్వహణ పనులకు సంబంధించిన అంశాలపై మంగ‌ళ‌వారం తార్నాకలోని ఎంఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల విడుదలలో జాప్యం, టెండర్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, జి.ఓ. నెం.66 అమలుకు సంబంధించిన సమస్యలను కాంట్రాక్ట‌ర్లు ఎంఎంసి అధికారుల‌ దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరితగతిన ప్రాసెస్ చేసి విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల తమ కార్యకలాపాలతో పాటు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోందని వివరించారు. అలాగే సర్కిల్, జోనల్, హెడ్ ఆఫీస్ స్థాయిలలో పెండింగ్ బిల్లులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, వర్క్ మాడ్యూల్ సిస్టమ్ లో ఉన్న సాంకేతిక మరియు పరిపాలనా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు.

అనేక కుటుంబాలు ఎంఎంసీ కాంట్రాక్టులపై..

వివిధ స్థాయిలలో ఆమోదాలు, బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యం కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొనసాగుతున్న అభివృద్ధి మరియు నిర్వహణ పనుల పురోగతిపై ప్రభావం చూపుతోందని కాంట్రాక్టర్లు వివరించారు. ముఖ్యంగా చిన్న కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. చిన్న కాంట్రాక్టర్లకు తగిన సహకారం, పరిష్కారాలు అందించాలని వారు అధికారులను కోరారు. అనేక కుటుంబాలు ఎంఎంసీ కాంట్రాక్టులపై ఆధారపడి జీవిస్తున్నాయని, వారికి సమాన అవకాశాలు కల్పించడంతో పాటు బిల్లులను సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా వారు నగర అభివృద్ధి పనుల్లో తమ వంతు పాత్రను కొనసాగించగలరని పేర్కొన్నారు.కాంట్రాక్టర్లు వ్యక్తం చేసిన సమస్యలు, సూచనలను ఎంఎంసి అధికారులు విన్నారు.

బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తి అయిందని..

ప్రభుత్వ నిబంధనలు మరియు మార్గదర్శకాల ప్రకారం అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తి అయిందని ఆ బిల్లులు ట్రెడ్స్ ద్వారా చెల్లిస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను దశల వారీగా చెల్లిస్తామని తెలిపారు. ఆర్థిక ప్రక్రియలను మరింత సరళీకృతం చేస్తామ‌ని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి మరియు నిర్వహణ పనులను సమర్థవంతంగా అమలు చేయడంలో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అన్ని వర్గాలు అంగీకరించాయి. ఈ స‌మావేశంలో ఎం ఎం సి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఫైనాన్స్ అదనపు కమిషనర్ సంచిత్ గంగ్వార్, చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ వెంకటేశ్వర్ రావు, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర్ రెడ్డి, సివిల్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Next Story