ఇకపై ఆన్ లైన్ టికెట్ల ద్వారా కీసరగుట్ట దర్శనం.. మంత్రి మల్లారెడ్డి

by Dishafeatures2 |
ఇకపై ఆన్ లైన్ టికెట్ల ద్వారా కీసరగుట్ట దర్శనం.. మంత్రి మల్లారెడ్డి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విఐపి, సిఫార్సు దర్శనాలు అనుమతించబడవని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. కీసరగుట్ట స్వామి వారి ఆలయ కార్యాలయంలో శివరాత్రి నేపద్యంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల నిర్వహణ అంశంపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దర్శనం కోసం ఇకనుంచి ఇంటర్ నెట్ లో టికెట్లు బుక్ చేసుకునేందుకు అవసరమైన నూతన వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్యూ లైన్ లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన త్రాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని, తొక్కిసలాట జరగకుండా చూడాలని, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. శివరాత్రి రోజున విఐపీ, వీవీఐపీ, సిఫార్సు లెటర్లు అనుమతించేదిలేదని, ఇందుకు ప్రజాప్రతినిధులతో పాటుగా స్థానికులు కూడా సహకరించాలని కోరారు.

పండగ రోజున చంటి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఎటువంటి పొరపాట్లు జరగకుండా అందరూ సమన్వయంతో పనిచేసి శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, ఆర్ డి ఓ రవి, డీఎస్పీ జానకీ ధరావత్, జడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేశ్, ఆలయ కమిటీ ఛైర్మన్ రమేశ్ శర్మ, కీసర సర్పంచి మాధురి, ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) సుధాకర్రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed