- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సీ కార్పొరేషన్ భూములపై మంత్రి అడ్లూరి ఆగ్రహం..
గుండ్లపోచంపల్లి–మైసమ్మగూడ శివార్లలో ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన భూముల కబ్జా వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది.

దిశ, మేడ్చల్: గుండ్లపోచంపల్లి–మైసమ్మగూడ శివార్లలో ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన భూముల కబ్జా వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. కబ్జాకు గురైన 49 ఎకరాల 20 గుంటల భూములను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల భవిష్యత్తు కోసం 1991లో సర్వే నంబర్ 509లో 49 ఎకరాల 20 గుంటల భూమిని ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించారని గుర్తు చేశారు. అయితే గత పాలకుల అండదండలతో కొందరు ప్రభావశీలులు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి కోట్ల రూపాయల సామ్రాజ్యాలు నిర్మించుకున్నారని విమర్శించారు."కబ్జా చేసిన వారి పేర్లు చెప్పి నా స్థాయిని తగ్గించుకోను. కానీ దళితుల హక్కులను హరించిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా..
దళితుల కోసం కేటాయించిన భూములను ఆక్రమిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసిన మంత్రి.. గుండ్లపోచంపల్లిలోని 49.20 ఎకరాల భూమిని వెంటనే సర్వే చేసి ఎస్సీ కార్పొరేషన్‌కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ భూములు, రైతుల భూములను కబ్జా చేయాలని చూసే భూ బకాసురులపై ఉక్కుపాదం మోపుతామని, ఎంతటి రాజకీయ పలుకుబడి ఉన్నా ఉపేక్షించబోమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. మంత్రి వెంట మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, జిల్లా కలెక్టర్ మనూ చౌదరి, మాజీ డీసీసీ హరివర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు, గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సాయి పేట శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రమణ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






