పేదల భూములపై కన్నేస్తే ఊరుకోం: మంత్రి అడ్లూరి

by Kodari Anjali |

ఎస్సీ కార్పొరేషన్ భూములపై కన్నేస్తే కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ జిల్లా పర్యటనలో మంత్రి అడ్లూరి వార్నింగ్ ఇచ్చారు.

పేదల భూములపై కన్నేస్తే ఊరుకోం: మంత్రి అడ్లూరి
X

దిశ, మేడ్చల్ బ్యూరో: రాష్ట్రంలోని దళితుల భూములను కబ్జా చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఆయన జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరితో కలిసి విస్తృతంగా పర్యటించి, పలు కీలక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

30 రోజులలో తరలిస్తాం..

మొదట బాచుపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నూతన భవన ప్రాంగణం సమీపంలో ఉన్న నిజాంపేట డంపింగ్ యార్డును మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులు, స్థానిక కాలనీవాసులు, గురుకుల విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారిన ఈ డంపింగ్ యార్డును 30 రోజుల్లోగా పూర్తిగా తరలిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ కొన్ని నిమిషాలు కూడా నిలబడలేని వాతావరణం ఉందని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇప్పటికే ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించామని తెలిపారు. కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని నెల రోజుల్లో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఈ ప్రాంతంలో రూ.20 కోట్ల వ్యయంతో ఎస్సీ విద్యార్థుల కోసం ఆధునిక హాస్టల్ నిర్మించామని, త్వరలో ఇక్కడికి రానున్న గురుకుల విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. అలాగే డంపింగ్ యార్డ్ పరిసరాలు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయన్న స్థానికుల ఆందోళనపై స్పందిస్తూ, పోలీసు శాఖతో మాట్లాడి ప్రత్యేక పెట్రోలింగ్ వాహనాన్ని ఏర్పాటు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

దళితుల భూములకు రక్షణ కవచం

అనంతరం గుండ్లపోచంపల్లి శివారులోని ఎస్సీ కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయన్న ఫిర్యాదులపై మంత్రి క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. 1991లో సర్వే నంబర్ 509లోని 49 ఎకరాల 20 గుంటల భూమిని ఎస్సీ విద్యార్థుల సంక్షేమం, ఉద్యానవన శిక్షణ కోసం కేటాయించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ అండదండలతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆర్థిక బలంతో దళితుల భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిపై సుమోటోగా తక్షణమే సమగ్ర సర్వే నిర్వహించి, హద్దురాళ్లు, గేట్లు ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సర్వే నివేదిక రాగానే పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ వేస్తామని, అవసరమైతే కబ్జాదారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అదే సమయంలో అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న రైతుల ప్రయోజనాలను రక్షిస్తూ, వారు పొలాలకు వెళ్లేందుకు అవసరమైన దారులు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర రెవెన్యూ మంత్రికి కూడా త్వరలోనే నివేదిక సమర్పిస్తామన్నారు.

ఘట్కేసర్‌లో ‘అందెశ్రీ స్మృతి వనం’

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మహాకవి, రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఘట్కేసర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన కేటాయించిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఇందుకోసం ప్రభుత్వం ఎకరం 22 గుంటల భూమిని కేటాయించిందని, ఇది కేవలం ఒక ఉద్యానవనం మాత్రమే కాకుండా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.4 కోట్ల అంచనా వ్యయంతో దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ స్మృతి వనంలో అందెశ్రీ విగ్రహం, ఆయన జీవిత చరిత్రను ప్రతిబింబించే శిలాఫలకాలు, ఉద్యమ గీతాల ప్రదర్శన గ్యాలరీ, సాహిత్య వేదికలను ఏర్పాటు చేసి, అనంతరం దీని నిర్వహణను హెచ్‌ఎండీఏ కి అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమాలలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, హనుమంత్ నాయక్, మేడ్చల్ ఆర్డీవో శ్యాంప్రసాద్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పద్మజ, మేడ్చల్ తహసీల్దార్ అనూష మరియు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story