అంతరాష్ట్ర గజదొంగ అరెస్ట్

by Disha Web Desk 1 |
అంతరాష్ట్ర గజదొంగ అరెస్ట్
X

రూ.30 లక్షల సొత్తు స్వాధీనం

దిశ, కుత్బుల్లాపూర్, పేట్ బషీరాబాద్: దొంగతనాల్లో రారాజు.. అతడు, ఓ రేప్ కేసులో ఏడేళ్లు జైలు శిక్షను అనుభవించాడు. ఇటీవలే జైలు నుంచి తిరిగొచ్చి దొంగతనాలకు పాల్పడుతన్న ఓ గజదొంగను జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి నిందితుడి నుంచి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బాలనగర్ డీసీపీ టీ.శ్రీనివాసరావు, ఏసీపీ గంగారం తెలిపిన వివరాల ప్రకారం. కర్ణాటక రాష్ట్రం బాల్కి ప్రాంతానికి చెందిన కమ్మసింగ్ అలియాస్ కరణ్ సింగ్ అలియాస్ ధరమ్ సింగ్ అలియాస్ ఆనంద్ సింగ్ కరుడుగట్టిన నేరస్థుడు. చిన్నతనం నుంచి దొంగతనాల్లో ఆరితేరిన యోధుడు. పలుమార్లు జైలుకి వెళ్లిన కమ్మ సింగ్ మర్డర్ కేసులో నిందితుడు కాగా ఓ రేప్ కేసులో ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యే బయటికి వచ్చాడు.

కుత్బుల్లాపూర్ సూరారం కాలనీ ఓం జెండా పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతను దొంగతనాలు చేయడమే పరిపాటిగా పెట్టుకున్నాడు. కాగా, గత నెల 31న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి శివానగర్ లో రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిలో చొరబడి కమ్మాసింగ్ భారీ చోరీకి పాల్పడ్డాడు. దర్యాప్తు చేసిన జీడిమెట్ల క్రైమ్ సీఐ వై.రామకృష్ణ, సీఐ పవన్, ఎస్సై ఆంజనేయులు బృందం నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి 316 గ్రాములు బంగారం, 1.26 కిలో వెండి, రూ.15లక్షల నగదు, రూ.30 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ఇతలపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 4, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 2, చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 4, తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 4, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దొంగతనాలు మొత్తం 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కేసును త్వరగా చేధించడమే కాకుండా భారీగా సొత్తును రికవరీ చేసిన కేసు ఇన్వెస్టిగేషన్ బృందాన్ని డీసీపీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.

పఠాన్ సినిమా చూసి వస్తూ చోరీ..

ఇక కమ్మ సింగ్ దొంగతనాలు చేసే తీరే వేరేగా ఉంటుంది. ఇతను అధిక సందర్భాల్లో సినిమాలు షికారులకు వెళ్లి వస్తునో, రైల్వే ట్రాక్, బస్టాండ్ లకు దగ్గర్లో ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకి పాల్పడుతూ ఉండటం అలవాటు. ఇదే క్రమంలో జనవరి 31న రాత్రి చింతల్ ఏసియన్ షా ధియేటర్లో "పఠాన్" సినిమా చూసి వస్తూ ఎదురుగా ఉన్న శివానగర్ లోకి వచ్చాడు. అయితే, అక్కడ ఉన్న కుక్కలు వెంటపడుతుంటే భయంతో పరుగులు తీశాడు.

కుక్కల నుంచి రక్షించుకోవడానికి అక్కడే ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి చొరపడ్డాడు. కుక్కల అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కమ్మసింగ్ అక్కడి నుంచి వెళ్తుండగా అదే ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించాడు. దీంతో, తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ రూ.8లక్షల నగదు, పది తులాల బంగారాన్ని దోచుకొని తాపీగా సూరారం లో తన ఇంటికి చేరుకున్నాడు.

సీసీ కెమెరాలతో నిందితుడి ఆచూకీ

భారీ చోరీని సీరియస్ గా తీసుకున్న జీడిమెట్ల పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శివానగర్ తో పాటుగా పరిసర ప్రాంతాల్లో అనుమానితుడిగా తచ్చాడుతున్న పలువురిని గమనించారు. నిందితుడు దొంగతనం చేసి బయటకు వచ్చి అక్కడి నుంచి సూరారం వరకు వెళ్లిన దృశ్యాలను సీసీ ఫుటేజీల సాయంతో గుర్తించారు. పలు రకాలుగా సూరారం కాలనీ పరిసర ప్రాంతాల్లో పలువురి కదలికలపై నిఘా పెట్టి చాకచక్యంగా నిందితుడు కమ్మ సింగ్ ను పట్టుకున్నారు.

జల్సా జీవితాన్ని అనుభవించడానికే కమ్మసింగ్ దొంగతనాలకు పాల్పడుతున్నాడని, పలుమార్లు జైలు శిక్ష పడినప్పటికీ అతడిలో మార్పు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. దొంగతనం చేసిన సొత్తును నిందితుడు అవసరం కొద్ది అమ్ముకుంటూ, మిగిలినవి తన వద్దే దాచుకోవడం, అవసరమైన సందర్భాల్లోనే సొత్తును అమ్ముతూ సొమ్ము చేసుకోవడం అతనికి అలవాటు.

Next Story

Most Viewed