ఆయనకు ముచ్చటగా మూడు పెళ్లిళ్లు...మళ్లీ పెళ్లి కోసం...

by Disha Web Desk 15 |
ఆయనకు ముచ్చటగా మూడు పెళ్లిళ్లు...మళ్లీ పెళ్లి కోసం...
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి : ఆయనకు ముచ్చటగా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. సహజీవనం అయితే ఓకే...కాపురం మాత్రం వద్దంటున్నాడు ఆ నిత్య పెళ్లికొడుకు. నెల్లూరుకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్ ,ఎస్ఐ. యుగేందర్ తెలిపిన కథనం ప్రకారం .. నెల్లూరు కు చెందిన డాక్టర్ మీనా రెడ్డికి (41) రెండు సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. దీంతో కొన్ని రోజుల క్రితం తనకు భర్త కావాలి అని నగరంలోని కవాడిగూడ కు చెందిన ఓ మ్యారేజీ బ్యూరోలో దరఖాస్తు చేసుకున్నారు. అలాగే సాఫ్ట్ వేర్ ఉద్యోగి వంశీ కృష్ణ కుటుంబ సభ్యులతో బోయిన్ పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈయన కూడా మీనా రెడ్డి దరఖాస్తు చేసుకున్న మ్యారేజీ బ్యూరోలోనే తనకు వధువు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. దాంతో వంశీ తో మీనా రెడ్డి కి పరిచయం ఏర్పడింది. దీంతో వంశీకృష్ణ (39) ని వివాహం చేసుకోవాలని ఈయన కుటుంబ సభ్యులు మీనా రెడ్డిని నెల్లూరు వెళ్లి ఒప్పించారు. వంశీ తల్లి ఇందిర మల్లారెడ్డి ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నట్టు మాయమాటలు చెప్పి మీనా రెడ్డి ని నమ్మించారు. డిసెంబర్ 31 ఏకాదశి రోజున వంశీ నీకు పసుపు తాడు కట్టి మళ్లీ హైద్రాబాద్ లో పెళ్లి చేసుకుంటాడని నెల్లూరులోనే ఒప్పించారు. వారి మాటలను నమ్మిన మీనా రెడ్డి సరే అని చెప్పింది. దీంతో నెల్లూరులో డాక్టర్స్ అసోసియేషన్ హాల్ ను వంశీ తన తల్లి ఇందిర పేరిట బుక్ చేసి అక్కడకు చేరుకున్నారు. డిసెంబర్ 31 న ఎలాంటి బంధుమిత్రులు లేకుండా గుట్టు చప్పుడు కాకుండా వంశీ తో మీనా రెడ్డి మెడలో పసుపుతాడు కట్టించారు. అనంతరం శోభనం కూడా చేయించారు. సరిగ్గా ఏడురోజుల తరువాత వాళ్లని తీసుకుని కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వచ్చారు. తరువాత జనవరి 4 న వంశీ తో బోయిన్ పల్లి లోని వారి ఇంట్లో తాళి కట్టించారు.

ఇలా సహజీవనం చేసిన 7 రోజుల తరువాత వంశీ కి మోజు తీరింది. దీంతో కొడుకు ఆదేశాల మేరకు మీనా రెడ్డి ని నమ్మించి కొన్నిరోజుల తరువాత వంశీ నీ దగ్గరకు నెల్లూరు వస్తాడని, అక్కడే ఉంటాడు అని నమ్మించారు. మీనా రెడ్డి ని నెల్లూరుకు పంపించారు. అయితే ఆనాటినుండి మీనారెడ్డి ఎన్నిసార్లు ఫోన్ చేసిన వంశీ తో పాటు కుటుంబసభ్యులు ఎవ్వరూ సమాధానం ఇవ్వకపోవడం తో హైదరాబాద్ కు వచ్చిన బాధితురాలు మీనా రెడ్డి వారి కుటుంబ సభ్యుల ను అడిగితే ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఆమెను వంశీ ఇంటిలో నే ఉంచుకొని ఆయన తల్లిదండ్రులు మళ్లీ మాయమాటలు చెప్పి కొడుకుతో సంసారం చేయించారు. ఆ తరువాత నీ పైన నాకు మోజు తీరిందని ,నీ అవసరం నాకులేదు, నీవు వెళ్లిపోవాలని ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తూ మూడు రోజులు ఆమె తో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా మా కుమారుడికి ఇవి వేమీ కొత్త కాదు అని, నీవు మూడో దానివని , మంత్రి మల్లారెడ్డి మాకు తెలుసు అని, నిన్ను ఏమైనా చేస్తాను అంటూ బెదిరించారు. దీంతో చేసేది ఏమీ లేక మీనారెడ్డి తిరుగు ప్రయాణం అవుతున్న సమయం లో వంశీ మళ్లీ కవాడిగూడ కు చెందిన మ్యారేజీ బ్యూరోకు ఫోన్ చేసి తనకు భార్య కావాలి అని, పెళ్లి సంబంధం చూడమని కోరాడు. ఈ విషయం తెలిసిన మీనారెడ్డి తాను మోసపోయినట్టు గ్రహించి మ్యారేజీ బ్యూరో వారి సహాయం తీసుకుని శనివారం బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం వంశీని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సోమవారం మీనా రెడ్డి ని భరోసా సెంటర్ కు తరలించనున్నట్లు మహిళా ఎస్ఐ ఝాన్సీ రాణి వెల్లడించారు.


Next Story

Most Viewed