మహిళా ఉద్యోగులే ఆ అధికారి టార్గెట్.. ఇంతకీ ఎవరతను

by Sumithra |
మహిళా ఉద్యోగులే ఆ అధికారి టార్గెట్.. ఇంతకీ ఎవరతను
X

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఓ అధికారి వేధింపులతో మహిళా ఉద్యోగులు బేంబేలేత్తుతున్నారు. కార్పొరేషన్ లో శానిటేషన్ విభాగంలో సుమారు రెండు వందల మంది వరకు మహిళా ఉద్యోగులు పని చేస్తుండగా, మున్సిపల్ కార్పొరేషన్ లో మరో 50కి పైగానే పలు విభాగాల్లో ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ లలో మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ లో నంబర్ 2 హోదాలో ఉన్న ఆ అధికారి వీరందరి పై పెత్తనం చెలాయిస్తూ యమకింకరుడిగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా, అమర్యాదగా నడచుకోవడం, చిన్నచిన్న కారణాలు సాకులుగా చూపిస్తూ కొందరు మహిళా ఉద్యోగుల పట్ల సదరు అధికారి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు మున్సిపల్ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహిళా ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు నమోదు చేయించకుండా వేదించడం, తన మాటకు ఎదురు చెప్పిన మహిళా సిబ్బంది పై పగ పెంచుకొని వారిని టార్గెట్ చేస్తూ ద్వంద అర్థాలు వచ్చేలా ఆ అధికారి బూతులు మాట్లాడటం లాంటి చేష్టలతో మహిళా సిబ్బందికి కాలయముడిగా మారినట్లు పేరు చెప్పడం ఇష్టం లేని పలువురు మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. ఇంట్లో భర్త కూడా అనరాని మాటలను ఈ అధికారి మహిళా సిబ్బంది, ఉద్యోగులను అంటూ తీవ్రంగా మనో వేదనకు గురిచేస్తున్నాడని చాలా మంది కొందరు మహిళా ఉద్యోగులు విలపిస్తున్నారు.

ఇక్కడికి విధులలో చేరకముందు ఇతర మున్సిపాలిటీలలో పని చేసిన సదరు అధికారి అక్కడి మహిళా సిబ్బంది పట్ల లైంగిక వేధింపులు చేశాడనే కారణంగా కొద్ది నెలలు అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇతగాడు ఇక్కడికి పలు సమస్యల పై వచ్చే మహిళా బాధితులు, ఫిర్యాదు దారులకు సైతం వేధింపులకు గురి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ అధికారి వేధింపులు భరించలేక కొందరు ఓ మహిళా సంఘం నాయకురాలిని ఆశ్రయించడంతో ఆ అధికారి వెకిలి చేష్టలు, వేధింపులు బయటకు వచ్చాయి. కన్నీటి పర్యంతంతో కొందరు ఉద్యోగులు ఆ మహిళా నేతను ఆశ్రయించి తన పేరు బయటకు రాకుండా చూడండి మేడం,... నాలాంటి వాళ్లు ఎందరో నిజాంపేట్ మున్సిపల్ లో వేధింపులు ఎదుర్కొంటున్నారు అని తీవ్ర ఆవేదనతో తెలపడం బాధాకరం. మహిళా ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న వేధింపుల పై పై స్థాయిలోని అధికారులకు ఫిర్యాదు చేస్తే ఆ అధికారి తన పదవీ, పలుకుబడితో ఎక్కడ తమ ఉద్యోగాలు ఊడగోడతాడో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇతగాడి వేధింపులకు చెక్ పడాలంటే, మహిళా ఉద్యోగులకు మున్సిపల్ కార్పొరేషన్ లో రక్షణ ఉండాలంటే సదరు పొగరుపోతూ అధికారి పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed