ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యేల గురి.. అవకాశం ఎవరికో..?

by Aamani |
ఎమ్మెల్సీ పదవిపై  మాజీ ఎమ్మెల్యేల గురి.. అవకాశం ఎవరికో..?
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలేవరు గెలువలేదు. ఐదు సీట్లకు గాను ఐదింటిని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది.దీంతో మంత్రి వర్గంలో జిల్లాకు చోటు దక్కలేదు. అయితే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోని కేబినెట్ లో పాగా వేయాలని పలువురు నేతలు ఊవ్విళ్లురారుతున్నారు. రేసులో మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మలిపెద్ది సుధీర్ రెడ్డిలు ముందున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో సదరు నేతలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా హస్తినా పర్యటన వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై రాహుల్ తో సహా ఏఐసీసీ పెద్దలతో చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

మైనంపల్లి వర్సెస్ మలిపెద్ది..

మల్కాజిగిరి తాజా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలు ఎమ్మెల్సీ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు. మైనంపల్లి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలవగా, మలిపెద్ది ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడ్చల్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. అయితే వజ్రేష్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిపై ఓటమి పాలయ్యారు. కాగా ముఖ్యమంత్రికి సుధీర్ రెడ్డి సమీప బంధువు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నాటి నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం ను కోరినట్లు సమాచారం. అదేవిధంగా మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరిలో ఓడినా.. తన కుమారుడు రోహిత్ ను మెదక్ లో గెలిపించుకున్నారు. మరికొందరు గెలుపు కోసం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కృషి చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తనకు ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ కట్టబెట్ట నున్నట్లు మైనంపల్లి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ద్వారా కేబినెట్ లోకి ఏంట్రి..?

రాష్ట్రంలో ఎన్నికల సీజన్ మొదలైంది. సర్పంచ్ ఎన్నికలను వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత పార్లమెంట్, మున్సిపాలిటీ,జీహెచ్ఎంసీ ఎన్నికలు వరుసగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించే సమర్దవంతమైన నాయకుడి అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో అన్ని సీట్లను బీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకోవడంతో.. కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారింది. స్థానిక సంస్థలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు నడిపించే నేతకు కీలకమైన పదవిని కట్టబెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.మలిపెద్ది సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులు ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం ఉండటంతో వారి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనంపల్లి గతంలో జీహెచ్ఎంసీ, పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మలిపెద్ది కి సైతం రూరల్ జిల్లాలోని 61 గ్రామ పంచాయితీలు, 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలపై మంచి పట్టు ఉంది. అయితే వీరిలో కీలక పదవి దక్కేదెవరికో..? మరి కొంత కాలం వేచి చూడాల్సి ఉంది.



Next Story