విద్యతోనే సమాజంలో పరివర్తన

by Sridhar Babu |
విద్యతోనే సమాజంలో పరివర్తన
X

దిశ, కూకట్​పల్లి : విద్యతో మాత్రమే సమాజంలో పరివర్తన తీసుకురావచ్చని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కూకట్​పల్లి జేఎన్​టీయూహెచ్​లో డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ 68వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన మహాపరినివాన దివస్​ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సటీ ప్రాంగణంలోని బాబా సాహెబ్​ అంబేద్కర్​ విగ్రహానికి, జవహార్​ లాల్​ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం జేఎన్​ ఆడిటోరియంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. విద్యార్థులు బాబా సాహెబ్​ అంబేద్కర్​ అడుగు జాడల్లో నడుస్తూ సమ సమాజ స్థాపనకు పాటు పడాలని అన్నారు. కులం పేరుతో పాఠశాలలోకి అనుమతించక పోయినా కుంగి పోకుండా తరగతి బయట కూర్చుని విద్యనభ్యసించిన మహా నాయకుడు అంబేద్కర్​ అని అన్నారు.

కులం పేరుతో దూరంగా పెట్టిన మొక్కవోని ధైర్యంతో కష్టపడి చదివి అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పబ్లిక్ ఫైనాన్స్​ పూర్తి చేశారని అన్నారు. కులం పేరుతో, వెనకబాటుతో వెనకడుగు వేసి ఉంటే మహోన్నత వ్యక్తిగా కీర్తించబడే వారు కాదని, అంబేద్కర్​ నెగెటివ్​ నుంచి పాజిటీవ్​ను మల్చుకుని జీవించారని​ అన్నారు. కేవలం విద్యతోనే సమాజ పరివర్తన సాధ్యం అవుతుందని అన్నారు. విద్యార్థులు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని అన్నారు. బాబా సాహెబ్​ అంబేద్కర్​ రచించిన భారత రాజ్యాంగంలో ప్రీయంబుల్​ను ప్రతి ఒక్కరూ తప్పక చదవాలని, తాను ఎప్పుడూ ప్రియంబుల్​ చదువుతానని, తన చాంబర్​లో ప్రియంబుల్​ ఫొటో ఫ్రేమ్​ చేయించి గోడకు ఏర్పాటు చేసుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ప్రియంబుల్​ను చదివి వినిపించారు. అంబేద్కర్​ కేవలం దళితులు, గిరిజనులు, పీడితులకు మాత్రమే ఆరాధ్యుడు కాదని, ప్రతి ఒక్కరికి ఆరాధ్యుడని, ప్రతి ఒక్కరికి ఓటు అనే హక్కును కల్పించి తన ప్రతినిధిని ఎన్నుకునే ఆయుధాన్ని అందించారని అన్నారు.

మహిళలకు సమాజంలో సముచిత స్థానం కల్పించేందుకు, హక్కులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత అంబేద్కర్​కు దక్కుతుందని అన్నారు. అదే విధంగా కార్మికులకు కేవలం 8 గంటలు మాత్రమే ఉండాలని కార్మిక చట్టాలను రూపొందించిన మహానీయుడు అంబేద్కర్​ అని అన్నారు. బాబా సాహెబ్​ అంబేద్కర్​ను స్పూర్తిగా తీసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్​ మంత్రులు అందరూ కలిసి కుల గణన కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. కుల గణన అనేది మెగా హెల్త్​ చెకప్​ వంటిదని అన్నారు. సమాజంలో ఎంత మంది వెనక బడిన వారు ఉన్నారు, వారికి ప్రభుత్వం ఏవిధంగా చేయూతను అందించగలదు అనే అంశాలపై దృష్టి సారించేందుకు కుల గణన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, కొంత మంది స్థానిక ఎన్నికల కోసమే ఇది అంటూ ఆరోపిస్తున్నారు అని తెలిపారు.

కానీ పేదల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. అనంతరం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్​ అధికారి రామకృష్ణ రావు మాట్లాడుతూ మూడు సంవత్సరాల పాటు కష్టపడి సూక్ష్మంగా పరిశీలించి ఎంతో మంది మేధావులతో చర్చించి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని అన్నారు. రాజ్యాంగం రచిస్తున్న సమయంలో జపాన్​ సైతం తమ దేశ రాజ్యాంగాన్ని రచించే పని అమెరికాకు అప్పగిస్తే కేవలం 15 రోజులలో రచించబడిందని, భారత రాజ్యాంగంలా మరి ఏ దేశ రాజ్యాంగం పఠిష్టంగా లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామిక వేత్త కె. లక్ష్మారెడ్డి, జేఎన్​టీయూహెచ్​ రెక్టార్​ విజయ్​ కుమార్​ రెడ్డి, రిజిష్ట్రార్​ వెంకటేశ్వర్​ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed