కరెంట్ బిల్లు కట్టలేదని జవహర్ నగర్ తహసీల్‌కు కనెక్షన్‌ కట్‌..

by Disha Web Desk 11 |
కరెంట్ బిల్లు కట్టలేదని జవహర్ నగర్ తహసీల్‌కు కనెక్షన్‌ కట్‌..
X

దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్ తహసీల్ మీటింగ్ హాల్ విద్యుత్‌ బిల్లు బకాయి ఎనిమిది నెలలుగా పేరుకుపోయింది. ఎన్నిసార్లు తిరిగినా చెల్లించకపోవడంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది తమ ‘పవర్‌’ చూపించారు. విద్యుత్ కనెక్షన్‌ కట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ శాఖల మధ్య పంచాయితీ విమర్శలకు దారితీసింది. అధికారులు పరస్పర అధికార బలప్రదర్శనకు దిగడంతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. జవహర్ నగర్ తహసీల్ హాల్ విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి.

ఎనిమిది నెలలలుగా బకాయి మొత్తం రూ. 5481 వెంటనే చెల్లించాలని స్పష్టం చేసిన విద్యుత్‌ శాఖ ఏఈ, శుక్రవారం తహసీల్‌కు కరెంట్‌ కనెక్షన్‌ తొలగించారు. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ కు ఫోన్ లో సమాచారం ఇస్తూ పవర్ కట్ చేయడంతో రెవెన్యూ సిబ్బంది షాక్‌ తిన్నారు. ప్రభుత్వ కార్యాలయమని కూడా చూడకుండా కరెంట్‌ కట్‌ చేస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్‌ మాట్లాడితే తమ పవర్‌ ఏమిటో చూపిస్తామని వాదోపవాదాలు జరిగాయి. విద్యుత్‌ శాఖ కార్యాలయం ప్రభుత్వ స్థలంలో కట్టారు. స్థలం కేటాయింపునకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తామన్నారు. రెండు శాఖలు తమ అధికారాలను ప్రదర్శించడంతో కార్యాలయాలకు వచ్చిన ప్రజలు నోరెళ్లబెట్టారు. కరెంట్ కట్ చేయడంతో రెవెన్యూ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది.





Next Story

Most Viewed