కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది: ఈటల రాజేందర్

by Mahesh |
కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది: ఈటల రాజేందర్
X

దిశ, మేడ్చల్ బ్యూరో/మేడిపల్లి: కేసీఆర్ పతనానికి పదేళ్లు పడితే.. రేవంత్ పతనానికి పది నెలలు కూడా పట్టేలా లేదని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బోడుప్పల్ లో నిర్వహించిన రోడ్ షో లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ముందుగా పీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పలువురికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై ఈటల నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కి చింత చచ్చిన పులుపు చావలేదన్నారు. పదేళ్ల కాలంలో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టలేదు. ఒక్క రేషన్ కార్డు అర్హలకు ఇవ్వలేదన్నారు.

సీఎం రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడానికి ఇంకా ఎన్ని నెలలు కావాలి రేవంత్ ? అని ఈటల ప్రశ్నించారు.ప్రధాని చేసిన అభివృద్దితో పాటు మీరు చేసిన అభివృద్ది పై చర్చిద్దాం.. దమ్ముంటే మాజీ, తాజా ముఖ్యమంత్రులిద్దరు ఎన్టీఆర్ చౌరస్తాలో చర్చకు రావాలని ఈటల సవాల్ విసిరారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో లేదు. కేంద్రంలో రాదన్నారు. 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఈ రెండు పార్టీలు ఓటు వేస్తే మొరీలో వేసినట్టేనని ఈటల అన్నారు.

పదేళ్లలో విద్వంసం..

పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ పేదల భూములను వక్ఫ్ భూములలో చేర్చారని, దీంతో బొడుప్పల్ వాసుల్లో కంటి మీద కునుకు లేకుండా చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వచ్చాక నైనా ఈ బాధలు తొలగిపోతాయి అని అనుకుంటే సాధ్యమయ్యేలా కనిపించడం లేదన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళపై అధికారం లేకుండా చేస్తున్నారు. పేదల కళ్ళల్లో కెసిఆర్ మట్టి కొట్టారు. కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. ఇల్లు కట్టుకుంటుంటే గద్దల్లా వాలుతున్నారట. పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని ఈటల హెచ్చరించారు. కేసీఆర్ బాధలు పోవాలంటే నన్ను గెలిపించండని గద్దెనెక్కిన రేవంత్ ఇచ్చిన ఓ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మహిళలకు ఒక ఉచిత బస్ ప్రయాణం తప్ప ఏదీ అమలు చేయలేదన్నారు.

కరెంట్ బిల్లు జీరో అన్నారు ఎక్కడైనా అమలు అవుతుందా..?మహిళలకు నెల నెలా రూ.2500 ఇ స్తానన్నాడు.. ఇచ్చాడా..? కేసీఆర్ కల్యాణలక్ష్మి చెక్కులను కనీసం పిల్లలు పుట్టాక నైనా ఇచ్చేవాడని, రేవంత్ ఆ లక్షతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తా అని సీఎం అయ్యాడు.కానీ ఇచ్చాడా.. ? అని రాజేందర్ ప్రశ్నించారు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోసం పని చేశాడని, నాయకులని కొన్నాడని. ఈ ముఖ్యమంత్రి కూడా అదే పని చేస్తున్నాడని మండిపడ్డారు. మోదీ నాలుగు కోట్లు ఇళ్లను కడితే.. మోదీ ఇచ్చిన రెండున్నర లక్షల ఇళ్లు కూడా కట్టలేని వ్యక్తి కేసీఆర్ అని ధ్వజమెత్తారు.పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, పేదలకు ఇళ్ల నిర్మాణం చేసే బాధ్యత మాది అని ఈటల తెలియజేశారు. ఈ రోడ్ షో లో మేడ్చల్ జిల్లా రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed