అప్పు చెల్లించడం లేదని బావను హత్య చేసిన బావమరిది

by Disha Web Desk 15 |
అప్పు చెల్లించడం లేదని బావను హత్య చేసిన బావమరిది
X

దిశ, కూకట్​పల్లి : కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ముళ్లకత్వ చెరువు సమీపంలో ఈ నెల 1వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్​ చేసి శుక్రవారం రిమాండ్​కు తరలించారు. కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్​, సీఐ కిషన్​ కుమార్​లు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి కోహీర్​కు చెందిన అన్వర్​(27)కు మియాపూర్​ హఫీజ్​ పేట్​కు చెందిన సయ్యద్​ అహ్మద్​ సోదరి షరీన్​ బేగంతో 2019లో వివాహం జరిగింది. ఇదిలా ఉండగా అన్వర్​ బావమరిది సయ్యద్​ అహ్మద్​ తన స్నేహితుడు అఖిల్​ వద్ద నుంచి రోజు నాలుగు వందల కిరాయికి ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో అఖిల్​ వద్ద నుంచి అన్వర్​ చేబదులుగా అప్పు తీసుకున్నాడు. అవి మిత్తితో కలిపి 1,45,000 రూపాయలు అయింది. దీంతో అఖిల్​ తరచూ అన్వర్​ను అప్పు తిరిగి చెల్లించాలని అడిగేవాడు. అన్వర్​ అప్పు చెల్లించక పోవడంతో అఖిల్​ తన మిత్రుడు అహ్మద్​ ఇంటికి వెళ్లి అప్పు చెల్లించాలని గొడవ పడ్డాడు.

డబ్బులు చెల్లిస్తానని ఒప్పుకొని మాటమార్చిన అన్వర్​

గత ఏడాది డిసెంబర్​ 30వ తేదీన అహ్మద్​ను తీసుకుని అఖిల్ కోహిర్​లోని అన్వర్​ ఇంటికి వెళ్లి అప్పు గురించి గొడవ పడ్డారు. అన్వర్​ తల్లి సమక్షంలో తొందరలోనే డబ్బులు చెల్లిస్తానని మాటిచ్చి మరుసటి రోజు తిరిగి తన నుంచి కాదు అని చెప్పాడు. దాంతో అహ్మద్​, అఖిల్​లు డబ్బులు వసూలు చేసేందుకు అన్వర్​ను జనవరి 1వ తేదీన నగరానికి తీసుకుని వచ్చారు. హపీజ్​ పేట్​లోని ఓ బార్​లో మద్యం సేవించి అక్కడి నుంచి జూబ్లిహిల్స్​కు వెళ్లి అక్కడ ఇమ్రాన్​ అనే వ్యక్తిని కలిసి మళ్లీ మద్యం తాగారు. అక్కడి నుంచి ముళ్లకత్వ చెరువు సమీపంలోకి వచ్చి మత్తులో ఉన్న అన్వర్​పై బీర్​ బాటిళ్లతో దాడి చేశారు. అక్కడే ఉన్న ఇమ్రాన్​ చంపవద్దని వారించినా వినకుండా అహ్మద్​, అఖిల్​లు కలిసి అన్వర్​ను హత్య చేశారు. అన్వర్​ నుంచి అప్పు తిరిగి రాదని, అఖిల్​ తరచూ ఇంటికి వచ్చి అప్పు విషయంలో గొడవ పడుతుంటాడని, దాంతో అన్వర్​ను అంతమొందించినట్టు అహ్మద్​ పోలీసుల విచారణలో నేరం అంగీకరించినట్టు ఏసీపీ తెలిపారు. అన్వర్​ హత్య కేసులో నిందితులను రిమాండ్​కు తరలించినట్టు ఏసీపీ పేర్కొన్నారు.


Next Story