తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. అనుమతుల్లేని ఆసుపత్రులపై కొరడా

by Dishanational2 |
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. అనుమతుల్లేని ఆసుపత్రులపై కొరడా
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై చర్యలకు మేడ్చల్ జిల్లా వైద్యారోగ్య శాఖ సిద్దమైంది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్స్ లేకుండానే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఫిజియోథెరపీ యూనిట్స్‌, డెంటల్‌ ఆస్పత్రులు.. నడుస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగిన తర్వాతే వాటికి అనుమతులు లేవన్న విషయం బయటపడుతోంది. ఇలాంటి ఆస్పత్రులు, సిబ్బందిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అనుమతుల్లేని ఆస్పత్రులపై కొరడా ఝుళిపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఈ నెల 21న బుధవారం ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు జిల్లా వైద్యారోగ్య అధికారులకు సర్క్యూలర్ జారీ చేశారు. తక్షణమే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోని తనిఖీలు ఏర్పాటు చేయాలని అదేశాలు జారీ చేశారు.

మేడ్చల్ జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ గురువారం తన కార్యాలయంలో జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా ఆసుపత్రులపై ఆరా తీశారు. అర్హత లేని వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది వివరాలను సేకరించాలని వైద్యాధికారులకు డాక్టర్ శ్రీనివాస్ అదేశాలు జారీ చేశారు. ఆసుపత్రులలో సరైన మౌలిక సదుపాయాలున్నాయా..? అవసరమైన వైద్య పరికరాలు, పారిశుధ్యం, నిర్వహణ తదితర అంశాలపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా బయో మెడికల్ వేస్ట్ మేనెజ్ మెంట్ లేకుండా నడుస్తున్న ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. పది రోజులలో రూట్ మ్యాప్ ను తయారు చేసుకొని, తనిఖీలు చేయాల్సిన అంశాలపై నివేదిక సమర్పించాలని కోరారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన వైద్యాధికారులపై సైతం చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కూడా సమకూర్చుకోవడంలేదన్నారు. ముఖ్యంగా మెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌, శానిటేషన్‌, అలాగే ఆస్పత్రుల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణ విషయంలో నిబంధనలను పాటించడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.. ఈ విషయాలన్నీంటిపైన జిల్లా వైద్యశాఖ దృష్టి సారించాయని తెలిపారు. మూకుమ్మడి తనిఖీలు జిల్లావ్యాప్తంగా అనుమతుల్లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలపై చేయనున్నట్లు తెలిపారు. తనిఖీ బృందాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లను నియమించుకోవాలని ఆదేశించారు. పది రోజుల్లో అన్ని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో తనిఖీలు పూర్తి చేయాలని, వెంటనే సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. అలాగే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టంలోని నిబంధనలను పాటించని ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, వైద్యులు, వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.


Next Story

Most Viewed