మాజీ మంత్రి సర్వే దారెటు?

by Dishafeatures2 |
మాజీ మంత్రి సర్వే దారెటు?
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒక్కరైన సర్వే సత్యనారాయణ పొలిటికల్ స్టెప్‌పై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఆయనకు కంటోన్మెంట్‌తో విడదీయరాని బంధం ఉంది.1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయంసాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అంతర్భాగమైన సిద్దిపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి 2004లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మల్యాల రాజ య్యపై విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సిద్దిపేట (ఎస్సీ-రిజర్వుడు) లోక్‌సభ నియోజకవర్గం మల్కాజిగిరి (జనరల్ స్థానం) లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పడడంతో సర్వే 2009లోను ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి టీ భీంసేన్‌పై గెలిచి రెండోసారి లోక్ సభలో అడుగుపెట్టారు. దీంతో 2012లో యూపీఏ (కాంగ్రెస్ పార్టీ) ప్రభుత్వంలో సర్వేను కేంద్ర మంత్రి పదవి వరించింది.

రాష్ట్రం ఏర్పడ్డాక 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో వరంగల్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.2018 ముందస్తు ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సాయన్న చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తానే ముఖ్య మంత్రి అవుతానని గత అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే విస్తృతంగా ప్రచారం చేశారు. కంటోన్మెంట్ బోర్డు పాలక ఎన్నికల్లోనూ తనతో సహా తన కుమార్తె, కుమారుడిని పోటీ చేయించి ఓటమిని చవి చూశారు. దీంతో ఈ సారి సర్వే సత్యనారాయణ కంటో న్మంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తా రా? లేదంటే మల్కాజిగిరి నుంచి లోక్ సభ బరిలో నిలుస్తారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

ఉత్తంతో వైరం.. పార్టీకి దూరం

అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేసి సర్వే ఆయనతో రాజకీయ వైరం పెంచుకున్నారు. తదనంతర పరిణామాల వల్ల సర్వే సత్యానారాయణను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని సర్వే తాను ఏఐసీసీ నేతనంటూ, తనను సస్పెండ్ చేసే స్థాయి ఉత్తంది కాదంటూ రాజకీయ దూమారం రేపారు. ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి తాను కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నానంటూ ప్రకటించారు. ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీగా ఉన్నంతకాలం గాంధీభవన్‌లో అడుగు పెట్టనంటూ స్పష్టం చేశారు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి, 2019లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినప్పుడు సర్వే ను కలిశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి పట్టేదారు సర్వేనేనని ప్రకటించారు. ఎంపీ ఎన్నికల్లో సర్వే మద్దతును కోరారు.ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయకపోయినా.. పలుమార్లు రేవంత్ ను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో రేవంత్ రెడ్డితో సర్వే మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నట్లు అర్థమవుతుం ది. అయితే సర్వే సత్యనారాయణ ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రేను కలిశారు. తనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో సర్వే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story