23న జహీరాబాద్ బంద్‌కు పిలుపు

by Disha Web Desk 22 |
23న జహీరాబాద్ బంద్‌కు పిలుపు
X

దిశ , జహీరాబాద్: ప్రభుత్వ ఆదేశాలతో చక్కెర కమిషనరేట్ తీసుకొచ్చిన దుర్మార్గమైన ఆదేశాలతో చెరుకు డైవర్షన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమయ్యారు. సోమవారం జహీరాబాద్‌లోని చెరుకు రైతులు ట్రై డెంట్ చక్కెర కర్మాగారం ఎదుట సమావేశమయ్యారు. వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 23న సీఎం కేసీఆర్ జహీరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా రైతు నాయకులు సీఎంకు జలక్ ఇచ్చారు. అదే రోజు జహీరాబాద్ బంద్‌కు పిలుపునిచ్చారు. కర్మాగార పరిధిలోని రైతులు పెద్ద ఎత్తున కర్మాగారం ఎదుట సమావేశమై ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. స్థానిక నేతలు, జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యుల నిర్లక్ష్యంతో విసుగు చెందిన రైతులు ఈనెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ జహీరాబాద్ పర్యటన సందర్భంగా బహిరంగ విన్నపం చేశారు.

కర్మాగారాన్ని తెరిపించడం, బకాయిల చెల్లింపు, గిట్టుబాటు ధర, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ప్రకటన, రాష్ట్రస్థాయి అడ్వైజర్ కౌన్సిల్ ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు,(ఎక్స్ఎల్‌ఆర్‌ఐ)తొ ఒప్పందం, సహకార రంగ అభివృద్ధికి సహకరించాలని వారి ముందు పలు డిమాండ్లుంచారు. రేపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులతో మరో సమావేశం ఏర్పాటు చేసి , పట్టణంలోని సామాజిక, వర్తక, వాణిజ్య, సంఘాలతో సమావేశమై వారి సహకారాన్ని కోరాలని నిర్ణయించారు. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల మద్దతు - సహకారం కోరాలని నిర్ణయించారు.

సమస్య పరిష్కారం అయ్యేవరకు కర్మాగారం ఎదుట నిరవధికంగా బైఠాయించేలా కార్యాచరణ చేపట్టారు. మధ్యాహ్నం వంటావార్పుతో కర్మాగారం ఎదుట భోజనాలు చేశారు. ఈ సమావేశంలో ఢిల్లీ వసంత్, కొండల్ రెడ్డి, హుగెల్లి రాములు, నర్సింహారెడ్డి, మొగుడంపల్లి ఆశప్ప, జలాలుద్దీన్, జగన్నాథ్ రెడ్డి, తిప్పారెడ్డి, కార్మిక నేత జగదీష్, వెంకట్ రెడ్డి, దూలయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story