మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక తీరింది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 19 |
మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక తీరింది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, మెదక్: రైల్వే అభ్యున్నతికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో 12 ప్రాజెక్టులకు రూ. 9494 కోట్లు మంజూరు చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్‌లో నూతనంగా నిర్మించిన మెదక్ రైల్వే లైన్ జాతికి అంకితం చేసిన ఆయన.. మెదక్ కాచిగూడ పాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెదక్ ప్రజల చిరకాల కోరిక తీరిందన్నారు. రైల్ కోసం ప్రజలు పోరాటాలు, ఆందోళన, దీక్షలు చేసి సాకారం చేసుకున్నారని.. ఇందులో అలే నరేంద్ర, విజయ శాంతి, కొత్త ప్రభాకర్ రెడ్డిల కృషి ఉందన్నారు. మెదక్ అక్కన్న పేట రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందన్నారు. 17 కిలో మీటర్ల లైన్ నిర్మాణం కోసం 118 కోట్ల ప్రతిపాదన చేయగా 205 కోట్ల వ్యయం అయిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయని తెలిపారు.

వరంగల్ కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్రం స్థలం కేటాయించిందని, త్వరలోనే 400 కోట్లతో నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీని వల్ల 300 మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. నిజాం కాలంలో నిర్మించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయం లాగా 653 కోట్లతో ఆధునికరించచనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు చర్లపల్లిలో రూ. 221 కోట్లతో టెర్మినల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. 43 స్టేషన్‌లలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైల్వే నిర్మాణ కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. మెదక్‌లో టూరిజం కోసం ఎమ్మెల్యే కోరగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదనలు పంపితే ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, లావణ్య రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, శరత్ చంద్ర యన్, నీరజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రాష్ట్ర వాటా ఇచ్చారు.. ఎంపీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైలు వచ్చిందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జోగిపేట, సంగారెడ్డిని కలిపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. టూరిజం స్పాట్‌గా అభివృద్ది చేయాలన్నారు. రాష్ట్రం వాటా ఇచ్చిందని, అందుకే కల సాకారమైందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు..

ఎమ్మెల్యే అరవై ఏళ్ల కల సాకారం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారాయి, నాయకులు మారారు కానీ.. రైలు రాలేదు.. రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం వల్ల రైలు వచ్చిందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టూరిజంకు 200 కోట్లు ఇవ్వాలని మంత్రిని కోరారు. గంగపూర్ బ్రిడ్జి వద్ద ఇబ్బందులను మంత్రికి వివరించారు. పార్లమెంట్ భవనంకు అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరారు.


Next Story

Most Viewed