అనుకున్నారు...అవిశ్వాసం పెట్టేశారు

by Disha Web Desk 15 |
అనుకున్నారు...అవిశ్వాసం పెట్టేశారు
X

దిశ, సంగారెడ్డి : దిశ ప్రతికలో వచ్చిన కథనం నిజమైంది. సంగారెడ్డి మున్సిపాలిటీ చైర్ పర్సన్ పై సభ్యులు అవిశ్వాసం తీర్మానం పెట్టారు. సభ్యుల సంతకాలతో కూడిన పత్రాలను కలెక్టరేట్ లో ఏవో కు అందించారు. మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి తీరుపై కౌన్సిలర్లు కొద్ది రోజులుగా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చైర్ పర్సన్ పదవికి మూడేళ్లు పూర్తి కావడంతో కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టారు. గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఏవో కు 22 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస పత్రాలను అందించారు. ఆ వ్యవహారం ఉమ్మడి మెదక్ జిల్లాలో చర్చనీయాంశం అయింది.

గత కొన్ని రోజులుగా కౌన్సిలర్లకు చైర్ పర్సన్ భర్తకు మనస్పర్థలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి మున్సిపాలిటీ కి రూ.50 కోట్లు విడుదల చేశారు. వచ్చిన నిధుల నుంచి కౌన్సిలర్ లకు అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో చైర్ పర్సన్ పై కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎలాగైనా చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లను పదవి నుంచి దింపేస్తామని , పార్టీకి విధేయులుగా ఉంటామన్నారు. ఈ సందర్బంగా 7వ వార్డు కౌన్సిలర్ బోయిని విజయలక్ష్మీ, 3వ వార్డు కౌన్సిలర్ మున్నూరు విష్ణువర్దన్ లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మీ భర్త రవి ఒంటెద్దు పోకడలతోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అవిశ్వాసానికి 28 మంది కౌన్సిలర్ల మద్దతు ఉందన్నారు. అవిశ్వాసం బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదని, మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ల సూచనలతో కొనసాగుతామని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం వ్యక్తులపై వ్యతిరేకతతోనే తప్ప పార్టీతో కాదన్నారు.


Next Story